India vs South Africa: మయాంక్ అగర్వాల్ సెంచరీ, భారీ స్కోరు దిశగా టీమిండియా

హైదరాబాద్: పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చెలరేగి ఆడుతున్నాడు. తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్ రెండో టెస్టులోనూ సఫారీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని సెంచరీ సాధించాడు.

ఫిలాండర్ వేసిన ఇన్నింగ్స్ 57వ ఓవర్ మూడో బంతిని ఫోర్‌గా మలిచి సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 184 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌కు ఇది రెండో సెంచరీ. ప్రస్తుతం 60 ఓవర్లకు గాను టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.

క్రీజులో మయాంక్ అగర్వాల్ (106), విరాట్ కోహ్లీ(8) పరుగులతో ఉన్నారు. అంతకముందు జట్టు స్కోరు 163 పరుగుల వద్ద పుజారా(58) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కగిసో రబాడ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పుజారా వెనుదిరిగాడు.

25 పరుగులకే రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను పుజారాతో కలిసి మయాంక్ అగర్వాల్ నిలకడగా ఆడుతూ భారీ స్కోరు దిశగా నడిపించాడు. కాగా, ఈ సిరిస్‌లో భాగంగా విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్(215) సెంచరీని డబుల్ సెంచరీగా మలచిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తన తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మలచిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో అంతకముందు దిలిప్ సర్దేశాయ్, వినోద్ కాంబ్లీ, కరుణ్ నాయర్‌లు ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన మయాంక్(76, 42) పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరిస్‌ను సాధించి 72 ఏళ్ల నిరీక్షణకు తెరదించడంలో మయాంక్ పాత్ర కూడా మరవలేనిది. ఇక, సొంతగడ్డపై ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో సైతం అద్భుత ప్రదర్శనతో చెలరేగుతున్నాడు. విశాఖ టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 317 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

READ SOURCE