ఐపీఎల్ 2020: పంజాబ్ నుంచి ఢిల్లీకి అశ్విన్.. బదులుగా ఇద్దరు!!

ఢిల్లీ: టీమిండియా సీనియర్ స్పిన్నర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. చాలా రోజులుగా అశ్విన్ ఢిల్లీ జట్టులోకి వెళుతున్నాడని వార్తలు వచ్చినా.. పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా ఆ వార్తలను ఖండించాడు. అయితే సుదీర్ఘ చర్చల అనంతరం తాజాగా ఏస్ స్పిన్నర్ సేవలను ఢిల్లీ దక్కించుకుంది. ఢిల్లీ జట్టులోకి అశ్విన్ చేరబోతున్నట్టు ఆ ఫ్రాంచైజీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం త్వరలో రానుంది.

చాలాకాలం క్రితమే అశ్విన్ బదిలీ చర్చలోకి వచ్చినా.. ఇటీవల కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో అనిల్ కుంబ్లే కలువడంతో బదిలీ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. గత రెండు సీజన్‌లకు పంజాబ్‌కు నాయకత్వం వహించిన అశ్విన్‌ను బదిలీ చేయాలని నిర్ణయించుకున్న జట్టు యాజమాన్యం.. కుంబ్లే వచ్చిన తర్వాత నిర్ణయాన్ని విరమించుకుంది. అయితే అశ్విన్‌కు బదులుగా ఇద్దరు యువ ఆటగాళ్లను ఢిల్లీ నుంచి తీసుకునేందుకు పంజాబ్ గతంలోనే ఒప్పందం కుదర్చుకుకుంది. దీంతో తాజాగా అశ్విన్ బదిలీపై పంపాలని పంజాబ్ నిర్ణయించుకుంది. ఐపీఎల్ 2020 సీజన్ వేలం ముంగిట పంజాబ్ ఈ నిర్ణయం తీసుకోవడంపై అందరూ ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు.

'అవును. అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేరనున్నాడు. అశ్విన్‌కు బదులుగా పంజాబ్ జట్టు ఢిల్లీ నుంచి ఇద్దరు ప్లేయర్లను పొందింది. ఈ ప్రక్రియ 99 శాతం పూర్తి అయింది' అని ఓ బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. అయితే అశ్విన్ స్థానంలో ఢిల్లీ వదులుకున్న ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

అశ్విన్ బదిలీపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. '2020 ఐపీఎల్‌లో అశ్విన్ ఢిల్లీ జట్టులో కలుస్తాడు. అశ్విన్ రావడం జట్టుకు బలాన్ని చేకురుస్తుంది. మా బౌలింగ్ మరింత పటిష్టంగా మారుతుంది' అని అన్నాడు. ఢిల్లీ జట్టులోని యువ ఆటగాళ్లను బదిలీ చేసి సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్‌ను కూడా గతంలో ఇలానే తీసుకుంది.

2018లో కెప్టెన్‌గా పంజాబ్ జట్టు పగ్గాలు అందుకున్న అశ్విన్.. 2019 సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కెప్టెన్‌గా కూడా పూర్తిగా విఫలమయ్యాడు. గత సీజన్‌లో పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో నిలిచింది. దీంతో అశ్విన్‌ను తప్పించి మరో ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పగించాలని పంజాబ్ ఫ్రాంఛైజీ గత రెండు మూడు నెలలుగా కసరత్తులు చేస్తోంది.

READ SOURCE