India vs South Africa: కోహ్లీ సెంచరీ, లంచ్ విరామానికి టీమిండియా 356/3

హైదరాబాద్: పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 273/3తో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా రెండో రోజు లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 356 పరుగులు చేసింది. ముఖ్యంగా ఈ సెషన్‌లో సఫారీ బౌలర్లు వికెట్లు తీయడంలో పూర్తిగా విఫలమయ్యారు.

ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(104), రహానే(58) పరుగులతో ఉన్నారు. రెండో రోజు ఆటలో భాగంగా కెప్టెన్, వైస్ కెప్టెన్ బాధ్యతాయుతంగా ఆడుతూ దక్షిణాఫ్రికా బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చేలరేగగా... వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

ముందుగా రహానే 145 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... 173 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో విరాట్ కోహ్లీ 101 పరుగులతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 26వ సెంచరీ కావడం విశేషం. అంతేకాదు ఈ ఏడాది(2019)లో ఇదే తొలి టెస్టు శతకం కావడం విశేషం.

ఈ ఏడాది టెస్టుల్లో తొలి సెంచరీని సాధించడానికి కోహ్లీకి 9 ఇన్నింగ్స్‌లు పట్టాయి. అంతకముందు 8 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. వీరిద్దరూ ఇప్పటికే నాలుగో వికెట్‌కు 150కిపైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడిగా కోహ్లీ-రహానేలు సరికొత్త రికార్డు నెలకొల్పారు.

ఇప్పటివరకు నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగులు(145) చేసిన జోడిగా ద్రవిడ్‌-గంగూలీ పేరిట ఉన్న రికార్డును తాజాగా కోహ్లీ-రహానేలు బద్దలు కొట్టారు. భారత బ్యాట్స్‌మెన్‌ ఇలాగే కొనసాగితే టీమిండియా భారీ స్కోర్‌ సాధించే అవకాశం ఉంది. తన 26వ సెంచరీతో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ టెస్టు సెంచరీల రికార్డుని సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యంత వేగంగా 40 సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్(41-376 ఇన్నింగ్స్‌లు), విరాట్ కోహ్లీ(40- 185 ఇన్నింగ్స్‌లు), గ్రేమ్ స్మిత్(33- 368ఇన్నింగ్స్‌లు), స్టీవ్ స్మిత్(20- 118 ఇన్నింగ్స్‌లు), మైకేల్ క్లార్క్(19- 171 ఇన్నింగ్స్‌లు), బ్రియాన్ లారా(19- 204 ఇన్నింగ్స్‌లు) ఈ జాబితాలో ఉన్నారు.

READ SOURCE