India vs South Africa 2nd Test Day 1: లంచ్ విరామానికి టీమిండియా 77/1

హైదరాబాద్: పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజు లంచ్ విరామ సమయానికి టీమిండియా 25 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్(34 నాటౌట్), ఛటేశ్వర్ పుజారా (19 నాటౌట్) పరుగులతో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే రోహిత్ శర్మ ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ చివరి బంతిని రోహిత్ శర్మ(14) డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

విశాఖ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచ‌రీల‌తో రోహిత్‌ శర్మ అలరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి స్థానంలో పేసర్ ఉమేశ్ యాదవ్‌కి తుది జట్టులో చోటు కల్పించింది. కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లికి ఇది 50వ టెస్టు. ఈ క్రమంలో కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది.

అత్యధిక మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవీ గంగూలీ (49) రికార్డుని కోహ్లీ అధిగమించాడు. 60 టెస్టులతో ఈ జాబితోలా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. భారత జట్టు సొంతగడ్డపై 2013 నుంచి 30 టెస్టులు ఆడితే 24 గెలిచి ఒకే ఒక్క టెస్టులో ఓడిపోయింది.

ఆ ఒక్క ఓటమి ప్రస్తుతం సఫారీలతో రెండో టెస్టు జరుగుతున్న పూణె స్టేడియంలోనే కావడం విశేషం. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా ఏకంగా 333 పరుగులతో ఓడిపోయింది. ఇప్పుడు రెండున్నరేళ్ల విరామం తర్వాత అదే పూణె రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తోంది.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటికే తొలి టెస్టులో గెలిచి ఉత్సాహంలో ఉన్న టీమిండియా... పూణె టెస్టులో కూడా విజయం సాధించి టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు సఫారీ జట్టు రెండో టెస్టులో విజయం సాధించి సిరిస్‌ను సమం చేయాలని భావిస్తోంది.

READ SOURCE