India vs South Africa: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.. చరిత్ర సృష్టించిన టీమిండియా !!

రాంచీ: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 132/8తో నాలుగో రోజు ఇన్నింగ్స్‌ను ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం రెండు ఓవర్లలో ఒక పరుగు చేసి ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్‌ నదీమ్‌ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది.

సరికొత్త చరిత్ర:

మూడో టెస్ట్ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్టు ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా జట్టుపై భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయడం ఇదే తొలిసారి. ఫలితంగా కొత్త రికార్డును సాధించింది. టెస్టు ఫార్మాట్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల ముఖాముఖి పోరులో దక్షిణాఫ్రికానే పైచేయి ఉండగా.. స్వదేశంలో జరిగే టెస్టుల విషయంలో మాత్రం భారత్‌దే పైచేయిగా ఉంది. కేవలం సొంతగడ్డపై సఫారీలతో ఒక్క సిరీస్‌ను మాత్రమే భారత్ కోల్పోయింది.

రికార్డుల్లో కోహ్లీ:

ఈ సిరీస్‌ ముందు వరకూ దక్షిణాఫ్రికాపై ఏ టెస్టు సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయలేదు. తాజాగా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు సాధించింది. దీంతో విరాట్ కోహ్లీ కూడా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇక దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. మరోవైపు విదేశాల్లో దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్‌ కావడం ఇది మూడోసారి. ఇంతకుముందు రెండు సార్లు ఆస్ట్రేలియాపై క్లీన్‌స్వీప్‌ అయింది.

133 పరుగులకే ఆలౌట్:

ఓవర్‌నైట్‌ స్కోరు 132/8తో నాలుగో రోజు మంగళవారం ఇన్నింగ్స్‌ను ఆరంభించిన దక్షిణాఫ్రికా కేవలం రెండు ఓవర్లలోనే ఆలౌట్ అయింది. లోకల్ స్పిన్న‌ర్‌ నదీమ్‌ చివరి రెండు వికెట్లు పడగొట్టడంతో సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలారు. నోర్జెతో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన డిబ్రుయిన్‌ (30).. రెండో ఓవర్‌లోనే నదీమ్‌ బౌలింగ్‌లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పేసర్ లుంగి ఎంగిడి ఒక్క బంతి మాత్రమే ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 497 పరుగులు చేసింది.

READ SOURCE