India vs South Africa: రాంచీ టెస్టుకు ముందు సఫారీలకు ఊహించని ఎదురుదెబ్బ!

హైదరాబాద్: భారత జట్టుతో మూడో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ మార్కరమ్‌ గాయం కారణంగా రాంచీ వేదికగా శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఏ ఆటగాడిని ప్రత్యామ్నాయంగా పిలవలేదు.

మార్కరమ్ స్వీయ తప్పిదం కారణంగానే అతడి చేతికి గాయం అయినట్లు తెలుస్తోంది. పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌ కావడంతో నిరాశకు గురైన మార్కరమ్‌ ఆవేశంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ వస్తువుని బలంగా గుద్దాడు. దీంతో అతడి చేతి మణికట్టుకి గాయమైంది.

రాంచీ వేదికగా మూడో టెస్టు

దీంతో శనివారం నుంచి రాంచీ వేదికగా ఆరంభం కానున్న మూడో టెస్టుకు దూరమయ్యాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టెస్టులో ఐయిడెన్ మార్కరమ్ 5, 39 పరుగులు చేసిన మార్కరమ్ రెండో టెస్టులో నిరాశపరిచాడు. నిజానికి ఈ సిరిస్‌లో ఓపెనర్ డీన్ ఎల్గార్‌తో పాటు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్‌కు అతను మూలస్థంభం అవుతాడని భావించారు.

నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడి 44 పరుగులు చేసిన మార్కరమ్

అయితే, ఈ పర్యటనలో మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన మార్కరమ్ 44 పరుగులు చేసి నిరాశపరిచాడు. మరోవైపు మార్కరమ్‌ కుడిచేయి మణికట్టుకు గాయం కావడంతో అతడు మూడో టెస్టుకు దూరమవుతున్న విషయాన్ని దక్షిణాఫ్రికా మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది. మార్కరమ్ గాయంపై దక్షిణాఫ్రికా టీమ్ డాక్టర్ మాట్లాడుతూ అతడి మణికట్టు విరిగిపోయిందని, స్వదేశానికి వెళ్లిన తర్వాత అతడు నిపుణుడిని సంప్రదిస్తానని అన్నారు.

స్వదేశానికి పయనమైన మార్కరమ్

దీంతో మార్కరమ్‌ ఉన్నపళంగా స్వదేశానికి పయనమయ్యాడు. మూడో టెస్టుకు దూరం కావడంపై మార్కరమ్‌ మాట్లాడుతూ "సిరిస్‌ మధ్యలో ఇలా స్వదేశానికి పయనం కావాల్సి వస్తుందని ఊహించలేదు. ఇది చాలా బాధాకరం. నాకు గాయం కావడం కంటే కూడా క్లిష్ట పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా జట్టుకు దూరం కావడం బాధిస్తుంది" అని అన్నాడు.

క్షమించడం అనేది ఏమీ లేదు

"క్షమించడం అనేది ఏమీ లేదు. ఇలా గాయం కావడానికి నేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో నిరాశలో నా చేతికి గాయం చేసుకున్నా. కొన్ని సందర్బాల్లో నిరాశ కూడా మరింత మెరుగు కావడానికి దోహదం చేస్తుంది" అని మార్కరమ్‌ పేర్కొన్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో మరో టెస్టు మిగిలుండగానే కోహ్లీసేన సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

READ SOURCE