India vs South Africa, 2nd Test: కెప్టెన్‌గా 50వ టెస్టు: కోహ్లీ ఖాతాలో రికార్డు చేరేనా?

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించనున్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గురువారం నుంచి పూణె వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది 50వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం.

కెప్టెన్‌గా టీమిండియాకు ఇప్పటికే అనేక విజయాలను సాధించిన విరాట్ కోహ్లీ.... పూణె టెస్టుతో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోనున్నాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా స్వదేశంలో ఆడిన అన్ని వేదికల్లోనూ విజయాన్ని సాధించింది. ఒక్క పూణెలో తప్ప. ఈ స్టేడియంలో జరిగిన ఒకే ఒక్క టెస్టులో టీమిండియా ఓడిపోయింది.

స్టీవ్ స్మిత్ సెంచరీ

2017లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టులో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ టెస్టుని కోహ్లీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

సిరిస్‌పై కన్నేసిన టీమిండియా

పూణె టెస్టులో కూడా విజయం సాధించి టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు సఫారీ జట్టు రెండో టెస్టులో విజయం సాధించి సిరిస్‌ను సమం చేయాలని భావిస్తోంది. ఈ సిరిస్‌లో రోహిత్ శర్మను ఓపెనర్‌గా జట్టు మేనేజ్‌మెంట్ ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. విశాఖ టెస్టులో రోహిత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండు సెంచరీలతో మెరిశాడు.

ఓపెనర్‌గా రోహిత్ శర్మ జోరు కొనసాగించేనా?

ఈ నేపథ్యంలో పూణె టెస్టులో సైతం ఓపెనర్‌గా రోహిత్ శర్మ పరుగుల వరద పారించాలని అభిమానులు కోరుకుంటున్నారు. విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌ విజృంభణకు తోడు బౌలర్ల కృషి తోడవ్వడంతో.. అచ్చొచ్చిన వైజాగ్‌ పిచ్‌పై భారత్‌ రెండో టెస్టు విజయాన్ని నమోదు చేసింది.

160 పాయిట్లతో అగ్రస్థానంలో టీమిండియా

చివరి రోజు పేసర్ మొహమ్మద్ షమీ (5/35), రవీంద్ర జడేజా (4/87) రాణించడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ భారీ విజయాన్ని అందుకుని 3 టెస్టుల ఫ్రీడమ్‌ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. ఈ టెస్ట్ విజయంలో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 160 పాయిట్లతో అగ్రస్థానంలో ఉంది.

READ SOURCE