India vs Bangladesh: బంగ్లాకు భారీ షాక్.. భారత పర్యటనకు తమీమ్‌ దూరం

ఢాకా: భారత పర్యటనకు ముందు బంగ్లాదేశ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ సీనియర్‌ క్రికెటర్, ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ స్వయంగా భారత పర్యటన నుంచి వైదొలిగాడు. తమీమ్‌ భార్య త్వరలో రెండో సంతానానికి జన్మనివ్వబోతున్నందున ఆ సమయంలో ఆమె పక్కన ఉండాలని తమీమ్‌ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) శనివారం ప్రకటించింది.

టీ20 సిరీస్‌కు ఎంపికైన తమీమ్ ప్రస్తుతం పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. దీనికి తోడు అతని భార్య ప్రసవానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో భారత పర్యటనకు అందుబాటులో ఉండడని బీసీబీకి తమీమ్ సమాచారం ఇచ్చాడు. తమీమ్ అభ్యర్థనను బీసీబీ కూడా ఆమోదించింది. 'తమీమ్ టీ20 సిరీస్‌తో పాటు కోల్‌కతాలో జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు' అని చీఫ్ సెలెక్టర్ అబెదిన్ తెలిపాడు. తమీమ్‌కు బదులుగా ఎడమ చేతివాటం ఆటగాడు ఇమ్రూస్ కయేస్‌ను బీసీబీ ఎంపిక చేసింది.

తమీమ్ ఇక్బాల్‌ బంగ్లాదేశ్ జట్టులోని అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాళ్ళలో ఒకడు. 17 సంవత్సరాల వయస్సులో 2007లో బంగ్లా తరఫున అంతర్జాతీయం అరంగేట్రం చేసాడు. అప్పటి నుండి జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. మూడు ఫార్మాట్‌లలో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కీలక భారత పర్యటన నుండి అతడు తప్పుకోవడం బంగ్లాకు పెద్ద లోటే.

వచ్చే నెల 3వ తేదీన ఢిల్లీలో జరుగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో భారత్‌-బంగ్లాదేశ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. అక్టోబర్‌ 30వ తేదీ నాటికి బంగ్లా క్రికెటర్లు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. రెండో, మూడో టీ20లను నాగ్‌పుర్‌, రాజ్‌కోట్‌లలో జరగనున్నాయి. అనంతరం ఇండోర్‌, కోల్‌కతాలో రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ జరుగుతుంది.

బంగ్లాదేశ్ టీ20 జట్టు:

షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ఇమ్రూస్ కయేస్‌, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, మహ్మద్ నయిం, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అపిఫ్ హుస్సేన్, మసదేక్ హుస్సేన్, అమినుల్ ఇస్లామ్, అర్ఫాట్ సన్నీ, మహ్మద్ సైఫుద్దీన్, అల్ అమిన్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైపుల్లా ఇస్లామ్.

READ SOURCE