India vs Bangladesh: తొలి టీ20.. ఢిల్లీ చేరుకున్న బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు!!

ఢిల్లీ: భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 3 నుండి ఢిల్లీ వేదికగా తొలి టీ20తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. భారత్‌లో మూడు వారాల పర్యటనకు కోసం బంగ్లాదేశ్‌ జట్టు బుధవారం ఢిల్లీ చేరుకుంది. బంగ్లాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బంగ్లాదేశ్ జట్టు నేరుగా ఢిల్లీ చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో బంగ్లా ఆటగాళ్లకు బీసీసీఐ నుండి ప్రత్యేక ఆహ్వానం లభించింది. అనంతరం ఆటగాళ్లు అందరూ హోటల్ చేరుకున్నారు. ఈ రోజు ప్రాక్టీస్ మొదలెట్టే అవకాశం ఉంది.

కొత్త సారథులు

బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, కెప్టెన్ షకీబుల్‌హసన్‌పై ఐసీసీ నిషేధం విధించడంతో.. భారత పర్యటనలో కొత్త సారథులు బంగ్లా జట్టును నడిపించనున్నారు. బంగ్లాదేశ్ టీ20 జట్టుకు మహ్ముదుల్లా రియాద్, టెస్టులకు మోమినుల్ హక్ సారథులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. టీ20 సిరీస్‌కు షకీబ్ స్థానంలో యువ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్, మహమ్మద్ సైఫుద్దీన్ గైర్హాజరీతో మహమ్మద్ మిథున్, ఇమ్రుల్ కైస్ టీ20 జట్టులో పునరాగమనం చేశారు.

నాపై పెద్ద బాధ్యత ఉంది

షకీబుల్‌పై ఐసీసీ నిషేధం విధించడంతో బంగ్లాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అయితే షకీబుల్‌ దూరమవడం జట్టుకు లోటు కాదని టీ20 కెప్టెన్ మహ్ముదుల్లా రియాద్ అంటున్నాడు. 'షకీబల్‌ లేకపోవడం మాకు ప్రేరణ ఇస్తుంది. దేశం కోసం పూర్తి శక్తిసామర్థ్యాలతో ఆడాలి. ప్రస్తుతం నాపై పెద్ద బాధ్యత ఉంది. నా శక్తిమేర ఆడతా. బీసీబీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా' అని రియాద్‌ అన్నాడు. బంగ్లాదేశ్‌ టీ20 జట్టులో మహ్మదుల్లా, ముష్ఫికర్‌ రహీమ్‌ మాత్రమే సీనియర్‌ ఆటగాళ్లు.

ఆదివారం తొలి టీ20

భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ టీ20, టెస్ట్ సిరీస్ ఆడనుంది. టీ20ల సిరీస్‌లో భాగంగా నవంబర్‌ 3న ఢిల్లీ వేదికగా బంగ్లాతో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అనంతరం రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా 14 నుండి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇక ఇరు జట్ల మధ్య 22-26 మధ్య రెండో టెస్టు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుంది. కోల్‌కతాలో డే-నైట్ టెస్ట్‌ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

టీ20 జట్టు:

మహ్మదుల్లా (కెప్టెన్‌), లిటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, మహ్మద్‌ నయీమ్‌, ముష్ఫికర్‌, అతీఫ్‌, మొసాదెక్‌, అనిముల్‌, అరాఫత్‌, అల్‌ అమిన్‌, ముస్తాఫిజుర్‌, సైఫుల్‌ ఇస్లాం, మహ్మద్‌ మిథున్‌, తైజుల్‌, హైదర్‌ రోనీ.

READ SOURCE