2nd T20Iలో రోహిత్ విధ్వంసం: చిత్తుగా ఓడిన బంగ్లా, సిరిస్ 1-1తో సమం

హైదరాబాద్: రాజ్‌కోట్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌ ఘన విజయాన్ని సాధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(85; 43 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి ఛేదించింది.

దీంతో మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది. రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు కూడా ఉండడం విశేషం. శిఖర్‌ ధావన్‌ (31; 27 బంతుల్లో 4 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (24*; 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్) మెరిశారు. లోకేశ్‌ రాహుల్‌ (8; 11 బంతుల్లో) నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో అమినుల్‌ ఇస్లామ్‌ 2 వికెట్లు తీశాడు.

లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్‌ వరుసగా మూడో ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. టీ20ల్లో నాలుగో సారి శిఖర్‌ ధావన్‌తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.


టీమిండియా విజయ లక్ష్యం 154

అంతకముందు టాస్ ఓడి రెండో టీ20లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం లభించింది. లిటన్ దాస్, మహ్మద్ నైమ్‌ల జోడీ తొలి వికెట్‌కి 60 పరుగులు జోడించారు. ఆ తర్వాత చాహల్ బౌలింగ్‌లో లిటన్ దాస్ పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత కొద్ది సేపటికే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో నయిమ్(36) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తొలి టీ20లో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ముష్ఫికర్ రహిమ్(4) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు.

చివర్లో సౌమ్య సర్కార్(30), కెప్టెన్ మహ్మదుల్లా(30) ఫరవాలేదనిపించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు వికెట్లు తీయగా... వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మాద్, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నాయి. రోహిత్ శర్మకు ఇది 100వ టీ20 కావడం విశేషం. భారత్ తరుపున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.

ఈ సిరిస్‌లో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(98 టీ20లు) రికార్డుని రోహిత్ శర్మ అధిగమించిన సంగతి తెలిసిందే.

అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు (top 5 men):

షోయబ్ మాలిక్ - 111

రోహిత్ శర్మ - 100

షాహిద్ అఫ్రిది - 99

ధోని - 98

రాస్ టేలర్ - 93

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక టీ20లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్(111) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో పలువురు టీమిండియా క్రికెటర్లను వ్యక్తిగత రికార్డులను సొంతం చేసుకున్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ మొత్తంగా తన కెరీర్‌లో 100వ టీ20 మ్యాచ్‌ని ఆడుతున్నాడు. భారత్ తరుపున ఇది 56వ టీ20 కావడం విశేషం. మరోవైపు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన 50వ టీ20 మ్యాచ్‌ని ఆడుతున్నాడు.

READ SOURCE