IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. 146 పరుగులకు భారత్ ఆలౌట్!!

వడోదర: వడోదరలోని రిలయన్స్‌ స్టేడియంలో సోమవారం దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో భారత మహిళలు తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యారు. 45.5 ఓవర్లలో 146 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా మహిళల ముందు 147 పరుగుల స్వల్ప లక్ష్యంను ఉంచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (38) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ చివరలో బౌలర్ శిఖా పాండే 35 పరుగులు చేయడంతో భారత్ 100 పరుగులు దాటగలిగింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళలకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు ప్రియా పూనియా (0), జెమిమా రోడ్రిగ్స్ (3) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. పూనియాను ఇస్మాయిల్ ఔట్ చేయగా.. కాప్ బౌలింగ్‌లో రోడ్రిగ్స్ పెవిలియన్ చేరింది. 5 పరుగులకే రెండు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును పూనమ్ రౌత్ (15), కెప్టెన్ మిథాలీ రాజ్‌ (11) ఆదుకునే ప్రయత్నం చేసినా.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.

ఒకవైపు హర్మన్‌ప్రీత్ కౌర్ ఒంటరి పోరాటం చేస్తున్నా.. దీప్తి శర్మ (7), తానియా భాటియా (6) సహకారం అందిచలేకపోయారు. అయితే బౌలర్ శిఖా పాండే అండతో హర్మన్‌ప్రీత్ ప్రొటీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపింది. హర్మన్‌ప్రీత్ నెమ్మదిగా ఆడగా.. శిఖా పాండే బ్యాట్ జులిపించింది. దీంతో భారత్ కుదురుకుంది. అయితే స్కోర్ వేగం పెరిగే సమయంలో హర్మన్‌ప్రీత్ పెవిలియన్ చేరింది. మరోకొద్ది సమయానికే పాండే, జోషి (12), బిస్త్ (6) ఔట్ అవ్వడంతో భారత్ కథ ముగిసింది. దక్షిణాఫ్రికా బౌలర్ మారిజాన్ కాప్ మూడు వికెట్లు తీసింది.

శుక్రవారం దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళలు ఘన విజయం సాధించారు. దక్షిణాఫ్రికా మహిళలు నిర్ధేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు 48 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించారు. పూనమ్ రౌత్ (65), కెప్టెన్ మిథాలీ రాజ్ (66) అర్ధ సెంచరీలు చేశారు. దక్షిణాఫ్రికా మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేశారు. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగులుండగానే భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. కీలక సమయంలో అర్ధ సెంచరీ చేసిన పూనమ్ రౌత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది.

READ SOURCE