IND vs SA: ఇదే మొదటిసారి.. ఒకే ఇన్నింగ్స్‌లో ఓపెనర్ల సెంచరీలు!!

వైజాగ్: మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్‌లు పరుగుల వరద పారించారు. ఓపెనర్‌లు రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ పోటీపడి బౌండరీలు, సిక్సులు బాదడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. రోహిత్‌ శర్మ తొలి రోజే సెంచరీ (176, 244 బంతుల్లో; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) చేయగా.. రెండో రోజు మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సెంచరీ (138; 270 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించాడు. ఇద్దరు భారత ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు సాధించడం ఇది 10వసారి.

భారత్‌ తరఫున ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, మురళీ విజయ్‌లు ఒకే ఇన్నింగ్స్‌లో చివరిసారిగా సెంచరీలు సాధించారు. 2018లో అఫ్గానిస్తాన్‌తో బెంగళూరులో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధావన్‌, విజయ్‌లు సెంచరీలు చేశారు. దక్షిణాఫ్రికాపై ఇద్దరు భారత ఓపెనర్లు (రోహిత్, మయాంక్) ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేయడం మాత్రం ఇదే మొదటిసారి. అయితే దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో ఇద్దరు ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం మాత్రం 10 ఏళ్ల తర్వాత ఇదే మొదటిది. 2009లో ఆసీస్‌ ఓపెనర్లు ఫిల్‌ హ్యూజ్‌,సైమన్‌ కాటిచ్‌లు సెంచరీలు చేశారు. ఇపుడు మయాంక్‌, రోహిత్‌లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేరారు.

రెండో రోజు 203 బంతుల్లో మయాంక్‌ అగర్వాల్‌ సెంచరీ సాధించాడు. ఇది మయాంక్‌ అగర్వాల్‌కు తొలి టెస్టు సెంచరీ. ఫలితంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో సెంచరీ సాధించిన 86వ భారత్‌ ఆటగాడిగా మాయంక్‌ గుర్తింపు సాధించాడు. ఇక విదేశాల్లో, స్వదేశంలో తొలి ఇన్నింగ్స్‌లో 50+ స్కోరు చేసిన ఆటగాడిగా మయాంక్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్‌-మయాంక్‌ అరుదైన రికార్డు సాధించారు. దక్షిణాఫ్రికాపై తొలి వికెట్‌కు (317) అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడీగా రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు సెహ్వాగ్‌-గంభీర్‌ (218) పేరిట ఉండేది.

రెండో రోజు 202/0తో ఆటను ప్రారంభించిన భారత్ వేగంగా పరుగులు చేసింది. రోహిత్, మయాంక్ పరుగుల ప్రవాహం పారించారు. మహారాజ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ స్టంప్‌ ఔట్‌ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా (6) త్వరగానే పెవిలియన్ చేరాడు. ప్రొటీస్ బౌలర్లను మయాంక్ సమర్ధంగా ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం భారత్ 92 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (8), మయాంక్‌ అగర్వాల్‌ (143) క్రీజులో ఉన్నారు.

READ SOURCE