IND vs SA: తొలి డబుల్‌ సెంచరీ.. మయాంక్‌ అగర్వాల్‌ ఆకలితో ఉన్నాడు!!

విశాఖ: మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేసాడు. సఫారీ బౌలర్ కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి మయాంక్ అగర్వాల్ (358 బంతుల్లో 200, 22 ఫోర్లు, 5 సిక్సులు) టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. ఆడేది ఐదో టెస్టు మ్యాచ్‌ అయినా.. ఎలాంటి బెరుకు లేకుండా తొలి టెస్టు సెంచరీని డబుల్ సెంచరీగా మలిచాడు. టెస్టు క్రికెట్‌ అంటే సుదీర్ఘంగా ఆడటమే కాదు.. అవసరమైతే బౌండరీల మోత మోగించడంలోనూ ముందుంటా అని మయాంక్ నిరూపించాడు.

మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించడానికి 203 బంతులు ఎదుర్కొంటే.. డబుల్‌ సెంచరీ చేయడానికి మరో 155 బంతులు మాత్రమే ఆడాడు. ఈ క్రమంలో మయాంక్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో తన తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన నాలుగో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అంతకముందు దిలిప్ సర్దేశాయి, వినోద్ కాంబ్లీ, కరుణ్ నాయర్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు.

202/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌.. 317 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ (176, 244 బంతుల్లో; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్‌ను కోల్పోయింది. రోహిత్ పెవిలియన్ చేరినా మయాంక్‌ మాత్రం నిలకడగా ఆడాడు. టెస్టు స్పెషలిస్టు చతేశ్వర్‌ పుజారా (6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (20), అంజిక్య రహానే (15) నిరాశపరిచిన వేళ.. మయాంక్‌ అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. డబుల్ సెంచరీ చేసి.. టెస్టు క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన 23వ భారత క్రికెటర్‌గా మయాంక్‌ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం భారత్ 124 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసింది. క్రీజులో విహారి (8), జడేజా (6) పరుగులతో ఉన్నారు.

డబుల్‌ సెంచరీ సాధించిన మయాంక్‌ అగర్వాల్‌పై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది. 'మయాంక్ అగర్వాల్ టాప్ క్లాస్ ఆట. అతను తన ఇన్నింగ్స్‌ను నిర్మించే విధానాన్ని ఇష్టపడతాడు. రోహిత్ తన ఇన్నింగ్స్‌తో అలరించాడు. మూడు ఫార్మాట్లలో 4 సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు' అని యూసుఫ్ పఠాన్ పేర్కొన్నాడు. 'శభాష్.. చాలా పెద్ద డబుల్ సెంచరీ' అని హర్భజన్ సింగ్ ట్వీటాడు. 'సూపర్ డబుల్ సెంచరీ మయాంక్ అగర్వాల్. నమ్మశక్యం కాని ప్రయత్నం' అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. 'డబుల్ సెంచరీ చూడటం చాలా సంతృప్తికరంగా ఉంది. అతను ఆకలితో ఉన్నాడు' అని హర్షా భోగ్లే పేర్కొన్నాడు.

READ SOURCE