IND vs SA: విశాఖ తొలి టెస్టులో నమోదైన రికార్డులు ఇవే!!

వైజాగ్: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌ విజృంభణకు తోడు బౌలర్ల కృషి తోడవ్వడంతో.. అచ్చొచ్చిన వైజాగ్‌ పిచ్‌పై భారత్‌ రెండో టెస్టు విజయాన్ని నమోదు చేసింది. చివరి రోజు పేసర్ మొహమ్మద్ షమీ (5/35), రవీంద్ర జడేజా (4/87) రాణించడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ భారీ విజయాన్ని అందుకుని 3 టెస్టుల ఫ్రీడమ్‌ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. సొంత గడ్డపై ఏడాది జరిగిన టెస్టులో భారత్ అద్భుత ఆటతో ఆకట్టుకుంది.

ఆటగాళ్ల రికార్డులు:

# టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించాడు.

#ఒక టెస్టులో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ పాక్ ఆటగాడు వసీమ్‌ అక్రమ్‌ (12 సిక్సర్లు) రికార్డును సమం చేశాడు.

#ఒక టెస్టులో రెండు సెంచరీలు బాదిన ఆరో బ్యాట్‌మెన్‌గా రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు విజయ్‌ హజారే, సునీల్‌ గవాస్కర్‌, రాహుల్‌ ద్రావిడ్‌, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానే సాధించారు.

# మయాంక్‌, రోహిత్‌ 300లకు పైగా తొలి వికెట్‌ భాగస్వామ్యం సాధించి రికార్డు సృష్టించారు. భారత్ , సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్‌లో అత్యధిక తొలి వికెట్‌ భాగస్వామ్యం సాధించిన ఓపెనర్లుగా మయాంక్‌, రోహిత్‌ రికార్డు సృష్టించారు. ఇంతకు ముందు 1996లో గ్యారీ కిరిస్టెన్‌, హడ్సన్‌ 236 పరుగుల రికార్డును భారత్‌ ఓపెనింగ్‌ జోడీ బద్దలు కొట్టింది.

# మయాంక్‌ అగర్వాల్‌ స్వదేశంలో ఆడుతున్న తొలి టెస్టులోనే సెంచరీని డబుల్‌ సెంచరీగా మలిచాడు. దిలీప్‌ సర్ధేశాయ్‌, వినోద్‌ కాంబ్లి, కరుణ్‌ నాయర్‌ల సరసన మయాంక్‌ చేరాడు.

# ఈటెస్టు మ్యాచ్‌లో భారత్ , దక్షిణాఫ్రికా జట్లు కలిపి అత్యధిక సిక్సర్లు (37) నమోదు చేశాయి. ఇంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్‌, న్యూజీలాండ్‌ (35 సిక్సర్లు) పేరిట ఉంది.

# ఆర్ అశ్విన్‌ 350 వికెట్ల క్లబ్‌లో చేరాడు. భారత్‌ తరఫున అతి తక్కువ మ్యాచ్‌ల్లో అశ్విన్‌ ఈ ఫీట్‌ సాధించాడు.

# ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు 5 వికెట్లు సాధించిన బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. అశ్విన్‌ కన్నా ముందు మురళీధరన్‌ 45 సార్లు 5 వికెట్లు సాధించాడు.

# రవీంద్ర జడేజా 150 వికెట్లు సాధించిన మూడో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా రికార్డు సాధించాడు. జడేజా కన్నా ముందు రంగనా హెరాత్‌, డేనియల్ వెటోరీ ఉన్నారు.

# ఈ టెస్ట్ విజయంలో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 160 పాయిట్లతో అగ్రస్థానంలో ఉంది.

READ SOURCE