IND vs SA 2nd Test: మయాంక్ అగర్వాల్ సెంచరీపై ఎవరేమన్నారు?

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో వరుసగా రెండో సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తెలిపాడు. పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్‌ అగర్వాల్ (108; 195 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్ రెండో టెస్టులోనూ సెంచరీ సాధించాడు. ఫిలాండర్ వేసిన ఇన్నింగ్స్ 57వ ఓవర్ మూడో బంతిని ఫోర్‌గా మలిచి సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌కు ఇది రెండో సెంచరీ. 25 పరుగులకే రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను పుజారాతో కలిసి ఆదుకున్నాడు.

పూజారాతో కలిసి రెండో వికెట్‌కు 138 పరుగులు

ఈ క్రమంలో పుజారా (58)తో కలిసి రెండో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం అందించాడు. మ్యాచ్ అనంతరం మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ "వరుసగా సెంచరీలు సాధించినందుకు సంతోషంగా ఉంది. పరుగులు చేయడం బాగుంది. ఒక బ్యాట్స్‌మన్‌ తక్కువగా ఉండి మొదటి బ్యాటింగ్‌ చేసినప్పుడు ఎక్కువ పరుగులు చేయడం మంచిది" అని తెలిపాడు.

వికెట్‌పై కాస్త తేమ ఉంది

"సుదీర్ఘంగా పరుగెత్తడం, ధ్యానం చేయడం, నా టెక్నిక్‌పై కష్టపడ్డాను. పూణె వికెట్‌పై కాస్త తేమ ఉంది. ఫిలాండర్‌, రబాడ కట్టుదిట్టంగా బంతులు విసిరారు. ఈ క్రమంలో కొన్ని బంతలను వదిలేశాను. చెత్త బంతుల కోసం ఎదురుచూశాను. 450-500 స్కోరు చేస్తే సఫారీలపై ఒత్తిడి పెంచొచ్చు. రెండోసారి మేం బ్యాటింగ్‌ చేయాల్సి వస్తుందో లేదో తెలీదు" అని మయాంక్ అన్నాడు.

తొలి టెస్టులో డబుల్ సెంచరీ

ఈ సిరిస్‌లో భాగంగా విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్(215) సెంచరీని డబుల్ సెంచరీగా మలచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మలచిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో అంతకముందు దిలిప్ సర్దేశాయ్, వినోద్ కాంబ్లీ, కరుణ్ నాయర్‌లు ఉన్నారు.

READ SOURCE