IND vs SA: దక్షిణాఫ్రికాతో భారత్ రెండో టీ20.. జోరు కొనసాగిస్తారా?

సూరత్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో బోణీ చేసిన భారత మహిళలు మరో పోరుకు సిద్ధమయ్యారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 గురువారం రాత్రి 7 గంటలకు సూరత్‌లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో జరగనుంది. తొలి మ్యాచ్‌లో స్పిన్ మాయాజాలంతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత మహిళల జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో మరింత ముందుకు వెళ్లాలని భావిస్తుంటే.. 1-1తో సమం చేయాలని సఫారీ జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

షఫాలీ వర్మపై అందరి దృష్టి:

మిథాలీ రాజ్ స్థానంలో అరంగేట్రం చేసిన 15 ఏండ్ల షఫాలీ వర్మ తొలి మ్యాచ్‌లో డకౌట్ కాగా.. ఈ మ్యాచ్‌లోనూ అందరి దృష్టి ఆమెపై ఉండనుంది. దూకుడుగా ఆడే షఫాలీ బ్యాట్ జుళిపిస్తే మంచి ఆరంభం దక్కనుంది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలి పోరులో ఒంటరి పోరాటం చేసి జట్టు గెలవడంతో కీలక పాత్ర పోషించింది. అయితే హర్మన్‌పై టీమిండియా ఎక్కువగా ఆధారపడుతోంది. హర్మన్‌కు తోడు స్మృతి మందన, రోడ్రిగ్స్, వేదా కృష్ణమూర్తి సహకారం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు.

దీప్తి శర్మ మరోసారి విజృంభిస్తే:

తొలి మ్యాచ్‌లో భారత స్పిన్నర్లే ఎనిమిది వికెట్లు తీయడంతో ఆ విభాగంపైనే ఇరు జట్లు ఎక్కువ దృష్టి సారించే అవకాశముంది. 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ మరోసారి అదే పిచ్‌పై విజృంభిస్తే.. సఫారీలకు కష్టాలు తప్పవు. రాధా యాదవ్‌ ఫామ్ కూడా టీమిండియాకు కలిసొచ్చే అంశం. పేస్, స్పిన్ బౌలర్లు సమిష్టిగా రాణిస్తే.. దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టొచ్చు.

డుప్రీజ్‌పైనే భారం:

మరోవైపు దక్షిణాఫ్రికా డుప్రీజ్‌నే నమ్ముకుంది. గత మ్యాచ్‌లో భారత్ స్పిన్‌ను ఎదుర్కొనేందుకు డుప్రెజ్ (59) తప్ప.. దక్షిణాఫ్రికా జట్టులో మిగిలిన వారంతా అష్టకష్టాలు పడ్డారు. అయితే ఓపెనర్ లీ, లారాలు ఫామ్ అందుకుంటే ప్రొటీస్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రొటీస్ బౌలర్లు తొలి మ్యాచులో టీమిండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన విషయం తెలిసిందే. అయితే భారత స్పిన్‌ను అంచనా వేయడంలో సఫారీ బ్యాట్స్‌వుమెన్‌ తీవ్రంగా తడబడ్డారు. ఈ బలహీనతను అధిగమించి రెండో మ్యాచ్‌లో దీటుగా పోరాడాలని పర్యాటక జట్టు పట్టుదలగా ఉంది.

11 పరుగుల తేడాతో విజయం:

మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 11 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), స్పిన్నర్‌ దీప్తి శర్మ (3/8) రాణించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. 131 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.5 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.

READ SOURCE