IND vs SA: విశాఖ టెస్ట్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

విశాఖపట్నం: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా విశాఖ సాగర తీరంలో దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. సీనియర్ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్ సాహా, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఇప్పటికే టీ20 సిరీస్ 1-1తో సమం అయినా నేపథ్యంలో తొలి టెస్ట్ గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఇక సొంతగడ్డపై ఏడాది విరామం తర్వాత భారత జట్టు టెస్టు ఆడబోతోంది. ప్రొటీస్ జట్టులో చాలా మంది సీనియర్లు లేకపోవడంతో..ఈ సిరీస్‌లో కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌గా విజయవంతమైన రోహిత్ శర్మ.. మిడిలార్డర్ నుంచి టెస్టు ఓపెనర్‌గా బరిలో దిగుతున్నాడు. దీంతో అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి వారసుడిగా ఆరంగేట్రం చేసిన యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ దారుణంగా విఫలమవడంతో సాహాకు ఓటేశాడు కెప్టెన్ కోహ్లీ. రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉండడంతో స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. తెలుగు తేజం హనుమ విహారి సొంత అభిమానుల మధ్య ఆడనున్నాడు. దీంతో అతనిపై కూడా విశాఖ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ బలమైన బ్యాటింగ్ లైనప్‌కు తోడు సొంతగడ్డ అనుకూలతతో విజయం సాధించాలని చూస్తోంది. పొట్టి సిరీస్‌ను సమం చేసి సమరోత్సాహంతో ఉన్న దక్షిణాఫ్రికా చాంపియన్‌షిప్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. నాలుగేండ్ల క్రితం భారత గడ్డపై టెస్టుల్లో ఎదురైన ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలని ప్రొటీస్ పట్టుదలగా ఉంది.

జట్లు:

భారత్‌: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్యా రహానె (వైస్‌కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌శర్మ, ఛెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, వృద్ధిమాన్‌ సాహా (కీపర్‌), జడేజా, అశ్విన్‌, ఇషాంత్‌శర్మ, మహ్మద్‌ షమి.

దక్షిణాఫ్రికా:

మార్‌క్రమ్‌, ఎల్గర్‌, డి బ్రున్‌, బువుమా, డుప్లెసిస్‌ (కెప్టెన్‌), డికాక్‌ (కీపర్‌), ఫిలాండర్‌, ముతుసామి, కేశవ్‌ మహారాజ్‌, డేన్‌పైత్‌, రబాడ.

READ SOURCE