మాక్స్‌వెల్‌ సంచలన నిర్ణయం.. క్రికెట్‌ నుంచి విరామం!!

అడిలైడ్: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్‌వెల్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా క్రికెట్‌ నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నట్టు మాక్స్‌వెల్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపాడు. ఇదే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ధ్రువీకరించింది. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ నుండి మాక్స్‌వెల్‌ తప్పుకున్నాడు. మిగిలిన టీ20 కోసం మాక్స్‌వెల్‌ స్థానంలో డిఆర్సీ షార్ట్ జట్టులోకి వచ్చాడు.

క్రికెట్‌ నుంచి స్వల్ప విరామం:

'బయటికి బాగానే ఉన్నట్టు కనిపించడం చాలా సులభం. చాలా మంది అభిమానుల ముందు ఆటగాళ్ళు ఆడుతారు కాబట్టి అలా ఉంటారు. నేను మానసిక సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. అందువల్లే క్రికెట్‌ నుంచి స్వల్ప విరామం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా. క్రికెట్ ఆస్ట్రేలియాకు కూడా విషయాన్ని చెప్పా' అని మ్యాక్స్‌వెల్‌ తెలిపాడు.

త్వరలోనే కోలుకుంటాడు:

మ్యాక్స్‌వెల్‌ తన మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను అధిగమించడంలో నిమగ్నమయ్యాడు. త్వరలోనే అతడు పూర్తిగా కోలుకుంటాడు అని ఆస్ట్రేలియా జట్టు మానసిక వైద్యుడు మైఖేల్ లాయిడ్ తెలిపారు. మ్యాక్స్‌వెల్‌ తన మానసిక ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. దీంతో అతను ఆటకు కొన్ని రోజులు దూరంగా ఉంటాడు. ఈ సమస్యలను అదిగమించడంలో నిమగ్నమయ్యాడు. త్వరలోనే అతడు పూర్తిగా కోలుకుంటాడు' అని మైఖేల్ చెప్పారు.

టీ20లో సెంచరీలు:

మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుతం వన్డేలు, టీ-20ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో టెస్టులు కూడా ఆడాడు. ఇప్పటివరకు 110 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్‌ 2877 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 61 టీ20లు ఆడి 1576 పరుగులు చేసాడు. ఇందులో మూడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

మ్యాక్స్‌వెల్ హెలికాఫ్టర్ షాట్:

తాజాగా అడిలైడ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ (62; 28 బంతుల్లో 7x4, 3x6) అర్ధ సెంచరీ చేసాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ హెలికాఫ్టర్ షాట్ కూడా ఆడాడు. పేసర్ కసున్ రజితా వేసిన బంతిని హెలికాఫ్టర్ షాట్ ఆడి స్టాండ్స్‌లోకి పంపాడు. అచ్చం ఎంఎస్ ధోనీ లాగే ఆడి అందరిని ఆశ్చర్యపరిచాడు. క్రికెట్ అభిమానులు ఈ షాట్ చూసి మ్యాక్స్‌వెల్‌పై ప్రశంసలు కురిపించారు.

READ SOURCE