స్మిత్‌కు అరుదైన గౌరవం.. ఎంసీసీ లైఫ్‌ మెంబర్‌గా ఎంపిక!!

లండన్‌: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌కు అరుదైన గౌరవం దక్కింది. మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ)లో గ్రేమ్‌ స్మిత్‌ జీవితకాల సభ్యునిగా ఎంపికయ్యాడు. గ్రేమ్‌ స్మిత్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ టిమ్‌ మే కూడా ఎంసీసీ లైఫ్‌ మెంబర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంసీసీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వీరి ఎంపికపై ఎంసీసీ సంతోషం వ్యక్తం చేసింది.

'దక్షిణాఫ్రికా దిగ్గజం గ్రేమ్‌ స్మిత్‌కు గౌరవ శాశ్వత సభ్యుడిగా ఎంసీసీలో చోటు దక్కింది. ఆస్ట్రేలియా స్పిన్నర్‌ టిమ్‌మే కూడా ఎంపిక అయ్యారు. ఎంసీసీ జీవితకాల సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపేందుకు సంతోషిస్తున్నాం' అని లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్ ట్విటర్‌లో పేర్కొంది. దీనిపై స్మిత్ స్పందించాడు. 'ఎంసీసీకి ధన్యవాదాలు. నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞుడిని. ఇప్పటికే క్రికెట్‌ వల్ల చాలా మధురానుభూతులను పదిలపరుచుకున్నా. భవిష్యత్తులో వాటిని మీతో పంచుకుంటా' అని స్మిత్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు.

ఈ ఏడాది ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కాలింగ్‌వుడ్‌, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ 'మిస్టర్ 360' ఏబీ డివిలియర్స్‌, ఆసీస్‌ మాజీ పేసర్ మిచెల్‌ జాన్సన్‌లకు కూడా ఎంసీసీ శాశ్వత సభ్యులుగా గౌరవం దక్కిన విషయం తెలిసిందే. తాజాగా గ్రేమ్‌ స్మిత్, టిమ్‌ మే ఆ జాబితాలో చేరారు. 22 ఏళ్లకే గ్రేమ్‌ స్మిత్‌ దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

స్మిత్‌ దక్షిణాఫ్రికా తరఫున 117 టెస్టుల్లో 9,265 పరుగులు, 197 వన్డేల్లో 6,989 పరుగులు చేసాడు. తొలి ఇంగ్లాండ్‌ పర్యటనలోనే లార్డ్‌ మైదానంలో బ్రాడ్‌మన్‌ రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు. లార్డ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (259) చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటికీ పలు రికార్డులు స్మిత్ పేరిటే ఉన్నాయి. అయితే తొందరగానే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టిమ్‌ మే ఆస్ట్రేలియా తరఫున 24 టెస్టుల్లో 75 వికెట్లు, 47 వన్డేల్లో 39 వికెట్లు తీసాడు.

READ SOURCE