CPL 2019: క్రిస్ గేల్ గోల్డెన్ డకౌట్ వీడియో చూశారా?

హైదరాబాద్: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో తొమ్మిదింట విజయాలను సాధించింది. తాజాగా గురువారం జమైకా తల్హాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అమెజాన్‌ వారియర్స్‌ మొదటి రెండు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షిమ్రాన్ హెట్‌మెయిర్, నికోలస్ పూరన్ నిరాశ పరచగా... బ్రెండన్ కింగ్, చంద్రపాల్ హేమరాజ్‌లు వరుసగా 1, 2 పరుగులకే పెవిలియన్‌కు చేరారు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌(73 నాటౌట్‌; 45 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా... రూథర్‌ఫర్డ్‌(45; 43 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. దీంతో గయానా అమెజాన్ వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన జమైకా తల్లావస్ జట్టు 16.3 ఓవర్లలో 79 పరుగులకే ఆలౌటైంది. జమైకా తల్లవాస్ ఓపెనర్, విండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్‌ ఫిలిప్స్‌(21), లిటాన్‌ దాస్‌(21), ట్రెవెన్‌ గ్రిఫిత్‌(11)లు రెండంకెల స్కోరును దాటగా మిగతా వారు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

మొత్తం 15 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోవడంతో జమైకా తల్లవాస్ ఘోరంగా ఓడిపోయింది. వారియర్స్‌ బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్‌ మూడు వికెట్లు తీయగా... క్వియాస్‌ అహ్మద్‌, కీమో పాల్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. మరోవైపు క్రిస్‌ గ్రీన్‌, హెమ్రాజ్‌, షోయబ్‌ మాలిక్‌లు తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన షోయబ్ మాలిక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

READ SOURCE