
హైదరాబాద్: భారత సింగిల్స్ స్టార్ యుకీ భాంబ్రీ తన ర్యాంకుని మరింతగా మెరుగుపరచుకున్నాడు. తాజాగా సోమవారం ఏటీపీ విడుదల చేసిన ర్యాంకుల్లో చెన్నై ఓపెన్ ఛాలెంజర్ టోర్నీలో రన్నరప్‌గా నిలవడం ద్వారా 11 ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 101కు చేరుకున్నాడు.
చెన్నై ఓపెన్ ఫైనల్లో ప్రత్యర్థి జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమిపాలైనప్పటికీ యుకీ భాంబ్రీ 48 ర్యాంకింగ్ పాయింట్లను సొంతం చేసుకున్నాడు. మరోవైపు సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన రామ్‌కుమార్ రామనాథన్ (140), సుమిత్ నాగల్ (216), ప్రజ్నిశ్ గుణేశ్వరన్ (242) ర్యాంకుల్లో ఉన్నారు.
యుకీ తన కెరీర్‌లో బెస్ట్ ర్యాంకు(88)ని నవంబర్ 2015లో అందుకున్నాడు. ఇక, డబుల్స్ విషయానికొస్తే రోహన్ బోపన్న(20), దివిజ్ శరణ్(42) ర్యాంక్‌ల్లో ఎలాంటి తేడా లేకపోగా, రెండు స్థానాలు చేజార్చుకుని లియాండర్‌పేస్ 49వ ర్యాంక్‌కు పడిపోయాడు.
డబ్ల్యూటీఏ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన అంకితా రైనా 255వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా, కర్మాన్‌కౌర్ 281లో స్థానంలో ఉంది. డబుల్స్‌లో 14వ ర్యాంక్‌లో కొనసాగుతోన్న సానియా మీర్జా ర్యాంకులో ఎలాంటి మార్పు లేదు.