హైదరాబాద్: వింబుల్డన్‌లో బుధవారం సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆండీ ముర్రే క్వార్టర్ ఫైనల్లో సామ్ క్వెరీ చేతిలో ఓటమి పాలయ్యాడు. మరోవైపు గాయం కారణంగా రెండో సీడ్ జొకోవిచ్ కూడా క్వార్టర్స్ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించాడు.
దీంతో వింబుల్డన్‌లో ఫేవరెట్ కథ ముగిసింది. ప్రస్తుతం టోర్నీలో తిరుగులేని ఫామ్‌లో ఉన్న మూడో సీడ్ ఫెదరర్ అలవోకగా సెమీస్‌కు దూసుకెళ్లాడు. దీంతో టాప్-4లో ఫేవరేట్‌గా ఫెదరర్ మాత్రమే మిగిలాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సామ్ క్వెరీ (అమెరికా) 3-6, 6-4, 6-7 (4/7), 6-1, 6-1తో ముర్రేను ఓడించాడు.

ఈ మ్యాచ్‌లో పదునైన సర్వీసులు చేసిన క్వెరీ మొత్తం 27 ఏస్‌లు సంధించాడు. 70 విన్నర్లు కొట్టాడు. మ్యాచ్ ఆరంభంలో ముర్రే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి తొలి సెట్‌ను 3-6తో అలవోకగా గెలుచుకున్నాడు. అయితే అతడు రెండో సెట్‌ను కోల్పోయాడు. ఇక హోరాహోరీగా సాగిన మూడో సెట్ గెలవడంతో మ్యాచ్‌లో విజయం అతడిదే అనుకున్నారు.

ఆ తర్వాత క్వెరీ పుంజుకున్నాడు. అదే సమయంలో తుంటి నొప్పి కారణంగా ముర్రే చురుగ్గా కదల్లేకపోయాడు. రెచ్చిపోయి ఆడిన క్వెరీ ఆఖరి రెండు సెట్లను అలవోకగా చేజిక్కించుకున్నాడు. 29 ఏళ్ల క్వెరీ తన 42వ ప్రయత్నంలో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు.
అంతేకాదు 2009 (ఆండీ రాడిక్) తర్వాత వింబుల్డన్ పురుషుల సింగిల్స్ సెమీస్ చేరిన తొలి అమెరికా ఆటగాడిగా క్వెరీ ఘనత సాధించాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 3-6, 7-6 (8/6), 7-5, 5-7, 6-1తో 16వ సీడ్ గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్)ను ఓడించాడు.