హైదరాబాద్: ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి మంచి ఫామ్‌లో ఉన్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న సోమవారం ప్రారంభమైన వింబుల్డన్‌లో కూడా సత్తా చాటుతున్నాడు. వింబుల్డన్‌లో నాదల్ మూడో రౌండ్‌ను విజయవంతంగా ముగించాడు.
దీంతో పురుషుల సింగిల్స్‌లో నాదల్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. వింబుల్డన్ వేదికపై నాలుగో రౌండ్‌లోకి దూసుకెళ్లడం 2014 తర్వాత నాదల్‌కిదే తొలిసారి కావడం విశేషం. శుక్రవారం జరిగిన పోరులో నాదల్ 6-1, 6-4, 7-6 (7-3) కచనోవ్ (రష్యా)పై విజయం సాధించాడు.
చివరిసెట్‌ను టైబ్రేక్‌లో గెలుచుకున్న నాదల్ మ్యాచ్ మొత్తమ్మీద 41 విన్నర్లు సంధించాడు. మరోవైపు సిలిచ్ 6-4, 7-6 (7/3), 6-4తో 26వ సీడ్ జాన్సన్ (అమెరికా)పై నెగ్గారు. దీంతో పురుషుల సింగిల్స్‌లో నాదల్ (స్పెయిన్)తో పాటు ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
ఇక ప్రీ క్వార్టర్స్‌లో నాదల్ లక్సెంబర్గ్ ఆటగాడు గిలెస్ ముల్లర్‌తో తలపడనున్నాడు. టాప్ స్టార్లకు గట్టిపోటీ ఇస్తాడనుకున్న ఆసియా నంబర్‌వన్ ఆటగాడు కీ నిషికొరి పోరాటం మూడోరౌండ్‌కే పరిమితమైంది. మరో మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన రోబర్టా బటిస్టా 6-4, 7-6(3), 3-6, 6-3తో జపాన్ స్టార్ నిషికొరిని చిత్తుచేసి ప్రీక్వార్టర్స్ చేరాడు.