హైదరాబాద్: క్రీడాకారుల పట్ల ఫ్యాన్స్ చూపించే అభిమానం ఓ సారి హద్దులు దాటుతుంది. అలాంటి సంఘటనే తాజాగా లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్‌లో చోటు చేసుకుంది. తన కెరీర్‌లో ఎన్నడూ ఇవ్వని విధంగా ఓ అభిమానికి ఆటో గ్రాఫ్ ఇచ్చి స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఆశ్చర్యపరిచాడు.
ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ రౌండ్ రౌండ్‌లో నాలుగో సీడ్ రఫెల్ నాదల్ 6-4, 6-2, 7-5 స్కోరుతో వరుస సెట్లలో అమెరికాకు చెందిన డొనాల్డ్ యంగ్‌ను చిత్తు చేశాడు. ఆట ముగిసిన అనంతరం ఫ్యాన్స్‌కు రఫెల్ నాదల్ ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమాని తన ప్రొస్తెటిక్ లెగ్ (అవయవమార్పిడి లెగ్) పై ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా నాదల్‌ను కోరాడు.

ఈ అనుకోని సంఘటన పట్ల నాదల్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అభిమాని కోరిక మేరకు ఆ ప్రొస్తెటిక్ లెగ్‌పై సంతకం చేశాడు. తన జీవితంలో చేసిన ఓ అరుదైన ఆటోగ్రాఫ్‌గా ఈ సంఘటనను అభివర్ణించాడు. ఇదే విషయాన్ని ఆట ముగిసిన అనంతరం మీడియాకి ఇచ్చిన ఇంటర్యూలో నవ్వుతూ చెప్పాడు.
ఇక డొనాల్డ్ యంగ్‌తో ఆడిన మ్యాచ్‌ని అద్భుతమైన మ్యాచ్‌గా నాదల్ అభివర్ణించాడు. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే తన ఆధీనంలో ఉందని చెప్పాడు. మ్యాచ్ ఎంతో సరదాగా సాగిందని, గెలిచినందుకు సంతోషంగా ఉందని ఫెదరర్ చెప్పాడు. కాగా ఈ ఏడాది వింబుల్డన్‌లో నాదల్ 850వ విజయం కావడం విశేషం. టెన్నిస్ ఆటగాళ్లు ఫెదరర్, జిమ్మీ కానర్స్ తదితరుల తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన ఏడో ఆటగాడిగా నాదల్ రికార్డు సృష్టించాడు.
అంతేకాదు గ్రాండ్‌స్లామ్‌లో 217 విజయాలతో మేజర్ టోర్నీల్లో అత్యధిక విజయాలు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఆరో ప్లేయర్‌గా చోటు దక్కించుకున్నాడు. ఇటీవలే రికార్డు స్థాయిలో పదో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గి ఊపు మీదున్న నాదల్ గత రెండేళ్లుగా గ్రాస్ కోర్టులో ఆడలేదు. గాయం కారణంగా గతేడాది వింబుల్డన్ టోర్నీకి కూడా దూరమయ్యాడు.