వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో ఇటలీ స్టార్ జాస్మిన్ పావోలిని ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్రొయేషియా ప్లేయర్, అన్‌సీడెడ్ డోనా వెకిచ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో జాస్మిన్ 2-6, 6-4, 7-6 (10/8)తో నెగ్గింది. మరో సెమీస్‌లో చెక్ రిపబ్లిక్ అమ్మాయి బర్బొరా క్రెజికొవా గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. కజికిస్థాన్ స్టార్ ప్లేయర్ రిబాకినాపై 3-6, 6-3, 6-4తో గెలిచింది.
రేపు జరగనున్న ఫైనల్‌లో టైటిల్ కోసం జాస్మిన్-క్రెజికోవా తలపడనుంది. అయితే జాస్మిన్-వెకిచ్ మధ్య జరిగిన సెమీస్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. ఈ పోరు 2 గంటల 51 నిమిషాల పాటు జరిగింది. తొలి సెట్‌లో 2-6తో కోల్పోయిన జాస్మిన్ ఆ తర్వాత చెలరేగింది. అద్భుతంగా పుంజుకుని రెండో సెట్ గెలిచి పోరు నిర్ణయాత్మక సెట్‌కు దూసుకెళ్లింది. ఇక మూడో సెట్‌లో మ్యాచ్ పాయింట్లు కాపాడుకుని విజయతీరాలకు చేరింది.

ఈ నేపథ్యంలో వింబుల్డన్ టోర్నీ సింగిల్స్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన ఇంగ్లండ్ తొలి క్రీడాకారిణిగా జాస్మిన్ చరిత్ర సృష్టించింది. జాస్మిన్ వింబుల్డన్‌లో గత మూడేళ్లు తొలిదశలోనే నిష్క్రమించింది. కానీ ఈ సారి సంచలన ప్రదర్శన చేస్తోంది. ఈ ఏడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ జాస్మిన్ ఫైనల్‌కు చేరింది. కానీ టైటిల్ గెలవలేకపోయింది. రన్నరప్‌గా నిలిచింది. మరో సెమీస్‌లో గెలిచిన క్రెజికొవాకు కూడా ఇదే తన తొలి వింబుల్డన్ టోర్నీ ఫైనల్.
ఇవాళ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్స్ జరగనున్నాయి. కార్లోస్ అల్కారజ్ (స్పెయిన్)తో మెద్వెదెవ్ (రష్యా) తలపడనున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అల్కారజ్ మరో టైటిల్‌పై కన్నేశాడు. మరో సెమీఫైనల్‌లో లొరెంజో ముసెట్టి (ఇటలీ)తో నొవాక్ జకోవిచ్ (సెర్బియా) పోటీపడనున్నాడు.