వింబుల్డన్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిక్ దూసుకెళ్తున్నాడు. కెరీర్‌లో 14వసారి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ చేరాడీ సెర్బియన్ స్టార్. మహిళల రెండో సీడ్ అరియానా సబలెంక, ఆన్స్ జెబ్యూర్ కూడా ముందంజ వేశారు. అదే సమయంలో మూడో సీడ్ డానిల్ మెద్వెదెవ్, మహిళల డిఫెండింగ్ చాంప్ ఎలెనా రిబకినాకు రౌండ్-16లో వాకోవర్ లభించింది.
అయితే, గ్రీకు ఆటగాడు స్టెఫనోస్ సిట్సిపాస్, మహిళల్లో రెండుసార్లు విజేత పెట్రా క్విటోవాకు ఈ టోర్నీలో షాక్ తగిలింది. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో రెండో సీడ్ జకోవిక్ (సెర్బియా) 7-6(6), 7-6(6), 5-7, 6-4తో 17వ సీడ్ హ్యూబర్ట్ హర్కాజ్ (పోలెండ్)పై కష్టపడి నెగ్గాడు. ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. దీన్ని సోమవారం కొనసాగించారు.

ఈ మ్యాచ్‌లో మూడు గంటలకుపైగా జొకో, హర్కాజ్‌లు హోరాహోరీ తలపడ్డారు. అయితే చివరకు విజయం జకోవిక్‌నే వరించింది. మరో మ్యాచ్‌లో ఐదు సెట్లపాటు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఐదో సీడ్ సిట్సిపాస్ 6-3, 6-7(4), 6-3 4-6, 4-6తో క్రిస్టోఫర్ యుబ్యాంక్స్ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో వింబుల్డన్ నుంచి సిట్సిపాస్ నిష్క్రమించాడు.
మరో గేమ్‌లో మెద్వెదెవ్, చెక్‌కు చెందిన జీరీ లెహెకాతో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 6-4,6-2తో మెద్వెదేవ్ జోరు చూపించాడు. ఇలాంటి సమయంలో జీరీకి గాయమైంది. ఈ కారణంగా అతను మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో మెద్వెదెవ్ తొలిసారి వింబుల్డన్ క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు.
ఇక పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డన్ జోడీ ప్రీక్వార్టర్స్ చేరింది. రెండో రౌండ్‌లో బోపన్న- మాథ్యూ జోడీ అద్భుతంగా ఆడింది. ఈ క్రమంలోనే బ్రిటన్ జోడీ జాకబ్ ఫియర్న్‌లే, జోహనస్ మండే జోడీపై 7-5, 6-3 తేడాతో వరుస సెట్లలో గెలిచి మ్యాచ్‌ను తమ ఖాతాలో వేసుకున్నాడు.