లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టోర్నీలో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగం టైటిల్‌ను చెక్ దేశానికి చెందిన మార్కెటా వొండ్రుసోవా తన ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె అద్భుతమైన ఆటతీరుతో ఆరో సీడ్ ఆన్స్ జెబ్యూర్‌ను మట్టికరిపించింది. ఎవరూ ఊహించని ఈ ఫలితంతో వింబుల్డన్ టైటిల్ నెగ్గిన మూడో చెక్ మహిళగా వొండ్రుసోవా రికార్డు సృష్టించింది.
ఫైనల్‌లో అద్భుంగా ఆడిన వొండ్రుసోవా.. వరుసగా 6-4, 6-4 తేడాతో ఆన్స్ జెబ్యూర్‌ను ఓడించింది. గతేడాది వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన ట్యునీషియా భామ తన ఓటమిని నమ్మలేకపోయింది. అయితే ఈ విజయంతో వొండ్రుసోవా మాత్రం.. ఓపెన్ ఎరాలో వింబుల్డన్ టైటిల్ విజేతగా నిలిచిన తొలి అన్‌సీడెడ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అంతకుముందు ఆమె 2019లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కూడా చేరింది.

కానీ ఆ టైటిల్ నెగ్గడంలో ఫెయిలైంది. ఆ మ్యాచ్‌లో బార్టీ చేతిలో ఓడింది. కానీ ఈసారి మాత్రం జెబ్యూర్‌ను ఓడించి రికార్డు సృష్టించింది. గంటా ఇరవై నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ఆసాంతం ఏకపక్షంగానే సాగింది. ఒకానొక దశలో జెబ్యూర్ వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి 4-2తో పైచేయి సాధించింది. అయితే ఏడో గేమ్‌లో బ్రేక్ పాయింట్‌తో ఒక్కసారిగా జోష్ అందుకున్న వొండ్రుసోవా.. వరుసగా మూడు గేమ్‌లు గెలిచి తొలిసెట్‌ను తన ఖాతాలో వేసుకొంది.
ఇక రెండో సెట్‌లో తొలి నాలుగు గేమ్‌ల్లో రెండుసార్లు వొండ్రుసోవా సర్వీస్‌ను జెబ్యూర్ బ్రేక్ చేసింది. ఈ జోరులోనే 4-3తో ఆధిక్యం సాధించింది. కానీ మరోసారి వొండ్రుసోవా వరుసగా మూడు గేమ్‌లు గెలిచి 5-4తో పైచేసి సాధించింది. ఆ తర్వాత జెబ్యూర్ తప్పిదాలతో మార్కెటా విజయానికి చేరువైంది. చివర్లో అద్భుతమైన వాలీతో విజయం సాధించింది. దీంతో జానా నొవొత్న, క్విటోవా తర్వాత వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో చెక్ మహిళగా రికార్డు సృష్టించింది.