
లండన్: రసవత్తరంగా సాగుతోన్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ 2022 టోర్నమెంట్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఛాంపియన్ రఫెల్ నాదల్ అర్ధాంతరంగా ఈ టోర్నీనుంచి తప్పుకొన్నాడు. క్వార్టర్ ఫైనల్స్ వరకు ఎదురులేని విజయాలను సొంతం చేసుకుంటూ వచ్చినప్పటికీ.. సెమీఫైనల్స్‌లో అతని దూకుడుకు అడ్డుకట్ట పడింది. వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌లో సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి సమాయాత్తమౌతున్న పరిస్థితుల్లో- అతను వైదొలిగాడు.
దీనికి కారణం- కడుపు నొప్పి. తీవ్ర కడుపు నొప్పి వల్ల ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సెమీ ఫైనల్స్‌లో నిక్ కిర్గియోస్‌ను ఎదుర్కొనాల్సి ఉంది. దీనికోసం ప్రాక్టీస్ చేస్తోండగా కడుపు నొప్పి ఆరంభమైంది. దీనితో నాదల్ విలవిల్లాడుతూ కోర్టులోనే కుప్పకూలాడు. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అబ్డామినల్ కండరాల్లో గాయం ఏర్పడిందని, సుమారు ఏడు మిల్లీమీటర్ల మీర కోసుకుపోయిందని డాక్టర్లు వెల్లడించారు.
విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో నాదల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు స్పానిష్ న్యూస్ పేపర్ మర్కా.. ఓ కథనాన్ని ప్రచురించింది. విశ్రాంతి తీసుకోవాలంటూ డాక్టర్లు సూచించిన కొద్ది సేపటికే నాదల్ ఓ ప్రకటన విడుదల చేశాడు. వింబుల్డన్ టోర్నమెంట్ నుంచి వైదొలగినట్లు అధికారికంగా ప్రకటించాడు. ప్రాక్టీస్ సమయంలో తాను కోర్ట్‌లోనే కుప్పకూలిపోవడాన్ని అందరూ చూశారని, దానికి కారణం కడుపు నొప్పి రావడమేనని వివరించాడు. ఆ కారణంతోనే టోర్నీ నుంచి వైదొలగుతున్నానని చెప్పాడు.
ఈ పరిస్థితుల్లో తాను రిస్క్ తీసుకోదలచుకోలేదని, డాక్టర్ల సలహా మేరకు కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటానని స్పష్టం చేశాడు. ఈ కష్ట సమయంలో అభిమానులు తోడుగా ఉంటారని ఆశిస్తున్నానని అన్నాడు. రఫెల్ నాదల్ ఇప్పటివరకు రెండుసార్లు వింబుల్డన్ టైటిల్ గెలిచాడు. మూడోసారి ఈ టైటిల్‌పై కన్నేసినప్పటికీ.. కడుపు నొప్పితో అనూహ్య పరిస్థితుల మధ్య తప్పుకోవాల్సి వచ్చిందతనికి. ఫైనల్స్‌లో కిర్గియోస్‌తో తలపడాల్సి ఉంది. మ్యాచ్ రద్దు కావడంతో అతణ్ని విజేతగా ప్రకటించారు నిర్వాహకులు.