
లండన్: రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యం దిశగా దూసుకెళుతున్నాడు. జకో వింబుల్డన్ 2021 పురుషుల సింగిల్స్‌లో 12వసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6-2, 6-4, 6-2తో గారిన్ (చిలీ)పై గెలిచాడు. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించిన జకోవిచ్.. మ్యాచ్‌లో 9 ఏస్‌లు, 29 విన్నర్లు కొట్టాడు. మేజర్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టడం జొకోవిచ్‌కు ఇది 50వ సారి. ఈ జాబితాలో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (18 సార్లు) ముందు వరుసలో ఉన్నాడు.
ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ), పదోసీడ్ షపొవలోవ్ (కెనడా), కచనోవ్ (రష్యా), ఫుక్సోవిచ్ (హంగేరి) తొలిసారి వింబుల్డన్ ప్రిక్వార్టర్స్ దాటారు. నాలుగో రౌండ్లో బెరెటిని 6-4, 6-3, 6-1తో ఇవష్కా (బెలారస్)ను ఓడించాడు. ఏడు ఏస్‌లు సంధించిన బెరెటిని.. ఏకంగా 37 విన్నర్లు కొట్టాడు. షపొవలోవ్ 6-1, 6-3, 7-5తో బటిస్టా అగట్ (స్పెయిన్)పై గెలుపొందాడు. పదునైన సర్వీసులు చేసిన షపొవలోవ్ మ్యాచ్‌లో 15 ఏస్‌లు కొట్టాడు. ఐదు సెట్ల ప్రిక్వార్టర్స్ పోరాటాల్లో కచనోవ్ 3-6, 6-4, 6-3, 5-7, 10-8తో కొర్డా (అమెరికా)పై నెగ్గగా.. పుక్సోవిచ్ 6-3, 4-6, 4-6, 6-0, 6-3తో అయిదో సీడ్ రుబ్లెవ్ (రష్యా)ను ఓడించాడు. ఈ ముగ్గురు వింబుల్డన్ క్వార్టర్స్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆష్లే బార్టీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో బార్టీ 7-5, 6-3తో క్రెజికోవాపై విజయం సాధించింది. గంటా 35 నిమిషాల్లో ముగిసిన పోరులో బార్టీ ఏడు ఏస్‌లు సంధించగా.. క్రెజికోవా నాలుగింటికే పరిమితమైంది. రెండో సీడ్ సబలెంక (బెలారస్) 6-3, 4-6, 6-3తో రిబకినా (కజకిస్థాన్)పై గెలుపొందింది. ప్లిస్కోవా (చెక్) 6-2, 6-3తో సమ్సనోవా (రష్యా)ను సునాయాసంగా ఓడించింది. ప్లిస్కోవా మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించింది.
ఆన్స్ జబేర్ (ట్యునీషియా) 5-7, 6-1, 6-1తో ఏడో సీడ్ స్వైటెక్ (పోలెండ్)పై విజయం సాధించింది. మొదటి సెట్లో ఓడిన తర్వాత పుంజుకుని.. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వింబుల్డన్ క్వార్టర్స్ చేరిన తొలి అరబ్ మహిళగా ఆమె ఘనత సాధించింది. ఇతర ప్రిక్వార్టర్స్‌లో కెర్బర్ (జర్మనీ) 6-4, 6-4తో కొకో గాఫ్ (అమెరికా)పై, ముచోవా (చెక్) 7-6 (8-6), 6-4తో బదోసా (స్పెయిన్)పై గెలిచారు. గొల్బిచ్ (స్విట్జర్లాండ్) 7-6 (7-3), 6-3తో కీస్ (అమెరికా)పై నెగ్గి తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్ చేరింది.