
లండన్: వింబుల్డన్ 2021లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ ఫెలిక్స్ తన గ్రాస్ కోర్ట్ బూట్లను లాకర్‌లో పెట్టి మర్చిపోయి కోర్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆపై విషయం తెలుసుకోవడంతో.. మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. వివరాల్లోకి వెళితే... వింబుల్డన్ 2021లో భాగంగా శనివారం నిక్ కిర్గియోస్, కెనెడా ఆటగాడు అగర్ అలియాస్సిమ్ మధ్య మూడో రౌండ్ మ్యాచ్ జరగాల్సి ఉండే. నిక్ మ్యాచ్ కోసం అన్నీ సిద్ధం చేసుకుని కోర్టులోకి ఎంటరయ్యాడు. వార్మప్ కూడా ప్రారంభం చేశాడు.
తీరా చూస్తే నిక్ కిర్గియోస్ తన గ్రాస్ కోర్ట్ షూస్‌కు బదులు సాధారణ బూట్లతో బరిలోకి దిగాడు. మ్యాచ్ ఉన్న తొందరలో గ్రాస్ కోర్ట్ బూట్లను లాకర్‌లో పెట్టి అతడు మర్చిపోయాడు. అక్కడే ఉన్న ఓ మహిళా స్టాఫ్ మెంబర్ నిక్ షూస్ తీసుకుని పరిగెడుతూ అక్కడికి వచ్చింది. ఆపై వాటితో బరిలోకి దిగాడు. దీంతో వార్మప్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'దుస్తులు, రాకెట్లు నాతొ పాటు తెచ్చుకుని, బూట్లను మాత్రం లాకర్‌లో మర్చిపోయా' అని నిక్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో గాయం కారణంగా నిక్ కిర్గియోస్ టోర్నీ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించాడు. తొలి రౌండ్‌లో 6-2తో దూసుకొచ్చిన నిక్.. ఆ తరువాతి రౌండ్‌ను 1-6తో కోల్పోయాడు. ఈ దశలో నిక్ గాయం బారిన పడటంతో ప్రత్యర్ధికి వాకోవర్ లభించింది. దీంతో అగర్ అలియాస్సిమ్ ప్రీక్వార్టర్స్‌కు ప్రవేశించాడు. నిక్ షూ ఘటనపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. 'స్పెషల్ షూస్ స్పెషల్ డెలివరీ', 'యుద్ధానికి బయల్దేరేముందు కత్తిని మర్చిపోయాడు' అంటూ కామెంట్లు చేసున్నారు.
వింబుల్డన్ 2021 మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. సీనియర్ ప్లేయర్ రోహన్ బోపన్నతో కలిసి బరిలోకి దిగిన సానియా రెండో రౌండ్‌లో 6-3, 6-1తో బ్రిటన్ జోడీ ఆడియన్ మెక్‌హ్యూజ్, విబ్లే స్మిత్‌ను ఓడించింది. 47 నిమిషాల్లోనే ముగిసిన పోరులో భారత జోడి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక వింబుల్డన్ సెంటర్, ఒకటో నెంబర్ కోర్టులు సోమవారం నుంచి వంద శాతం అభిమానులను అనుమతించనున్నారు.