జోరు మీదున్న ఫెదరర్: 16వసారి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లోకి


హైదరాబాద్: డిఫెండింగ్ ఛాంపియన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ వింబుల్డన్‌లో తన జోరుని కొనసాగిస్తున్నాడు. సోమవారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఫెదరర్ 6-0, 7-5, 6-4తో మన్నారినో (ఫ్రాన్స్)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గంటా 45 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ తొలి సెట్లో ఫెదరర్ ప్రత్యర్థికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు.
మూడుసార్లు మన్నారినో సర్వీసు బ్రేక్ చేసిన రోజర్ ఫెదరర్.. 12 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. రెండో సెట్లో ప్రత్యర్థి కాస్త ప్రతిఘటించినా పదకొండో గేమ్‌లో బ్రేక్ సాధించిన ఫెదరర్.. 7-5తో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. ఆఖరి సెట్లోనూ అదే జోరు కొనసాగిస్తూ 6-4తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు.

ఒక్కసారి కూడా సర్వీస్ కోల్పోని ఫెదరర్
ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా సర్వీస్ కోల్పోని ఫెదరర్.. ఈ మ్యాచ్‌లో 20 అనవసర తప్పిదాలకు పాల్పడటంతో పాటు 44 విన్నర్స్ కొట్టాడు. వరుసగా 20వసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ఫెడరర్ 16వసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మొత్తంగా అతని కెరీర్‌లో 53వసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అండర్సన్‌తో ఫెదరర్ తలపడనున్నాడు.

క్వార్టర్ ఫైనల్‌కు చేరిన రఫెల్ నాదల్
మరోవైపు ప్రపంచ నంబర్‌వన్ రఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 6-3, 6-3, 6-4తోజిరీ వెసిలీ (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించాడు. మిగతా మ్యాచ్‌ల్లో నిషికోరి (జపాన్) 4-6, 7-6 (7-5), 7-6 (12-10), 6-1తో గుల్బిస్ (లాత్వియా)పై విజయం సాధించాడు. ఇస్నర్ (అమెరికా), రోనిచ్ (కెనడా), అండర్సన్ (దక్షిణాఫ్రికా) కూడా ముందంజ వేశారు.

13వసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన సెరెనా విలియమ్స్
మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 13వసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా 6-2, 6-2తో రొడీనా (రష్యా)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పది ఏస్‌లు కొట్టిన సెరెనా.. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసింది.

బెర్‌టెన్స్ చేతిలో ఓటమిపాలైన కరోలినా ప్లిస్కోవా
మరోవైపు ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 3-6, 6-7 (1/7)తో కికి బెర్‌టెన్స్ (నెదర్లాండ్స్) చేతిలో ఓటమి పాలైంది. ప్లిస్కోవా ఓటమితో మహిళల సింగిల్స్‌లో టాప్-10 సీడెడ్ క్రీడాకారిణిలందరూ క్వార్టర్ ఫైనల్లోపే టోర్నీ నుంచి నిష్క్రమించారు. మరోవైపు లాత్వియా అమ్మాయి వొస్తాపెంకొ 7-6 (7-4), 6-0తో సన్‌సోవిచ్ (బెలారస్)పై నెగ్గగా.. కెర్బర్ 6-3, 7-6 (7-5)తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్)ను ఓడించింది.

క్వార్టర్ ఫైనల్లోకి దివిజ్ శరణ్ జోడీ
ఇక, పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్ (భారత్)-ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జోడీ అద్భుత విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. 3 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్‌లు కోల్పోయిన శరణ్ జోడీ ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు గెలిచి విజయం సాధించడం విశేషం. గ్రాండ్‌స్లామ్‌లో క్వార్టర్స్ చేరడం దివిజ్‌కు ఇదే తొలిసారి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications