హైదరాబాద్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీకి ఓ డ్రస్ కోడ్ ఉంది. సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీలో ఐదు సార్లు వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచిన వీనస్ విలియమ్స్ (అమెరికా) ఆ నిబంధనను అతిక్రమించింది. దీంతో టోర్నీ నిర్వహకులు ఆమెను హెచ్చరించారు.
వివరాల్లోకి వెళితే ఎలిస్ మెర్టెన్స్‌తో సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ సందర్భంగా వీనస్ విలియమ్స్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒకసారి ఆమె వేసుకున్న డ్రెస్‌లోంచి పింక్ బ్రా స్ట్రాప్ బయటకు కనిపించింది.

దీంతో టోర్నీ అధికారులు ఆమెను హెచ్చరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండో సెట్ విరామం సమయంలో వీనస్ విలియమ్స్ లాకర్ రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. తిరిగొచ్చిన ఆమె తెలుపు రంగు 'బ్రా'తో బరిలోకి దిగింది. వింబుల్డన్ టోర్నీకి ఓ ప్రత్యేకత ఉంది.
టోర్నీలో భాగంగా ఆట సమయంలో బయటకు కనిపించే లోదుస్తులు కూడా పూర్తిగా తెలుపు రంగుల్లోనే ఉండాలి. ఒకవేళ దుస్తుల చివర్లో మరో రంగు సన్నగా కనిపిస్తుంటే అది ఒక సెంటీమీటర్‌కు మించి ఉండరాదు' అని వింబుల్డన్ నిబంధనలు చెబుతున్నాయి.
వీనస్ విలియమ్స్ బ్రా మార్పుపై టోర్నీ నిర్వాహకులు స్పందించేందుకు నిరాకరించారు. వీనస్ వేసుకున్న పింక్ బ్రా తొలుత కనిపించలేదని, ఆట జరుగుతున్న సమయంలో మాత్రమే కనిపించిందని అందుకే ఆమెకు ఆ విషయాన్ని తెలిపామని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే లోదుస్తుల అంశంపై మీడియా సమావేశంలో చర్చించడం సభ్యత కాదని మ్యాచ్ అనంతరం వీనస్ విలియమ్స్ వ్యాఖ్యానించింది. 'లో దుస్తులపై ఇక్కడ మాట్లాడటం సభ్యత కాదు. చాలా అసభ్యంగా ఉంటుంది. దీనిని వదిలేయండి. ఈ విషయంపై మీ స్నేహితులతో చర్చించండి' అని వీనస్ పేర్కొంది.