హైదరాబాద్: మ్యాచ్‌కి సంబంధించిన తీపి గుర్తులను ఇంటికి తీసుకెళ్లడం క్రీడాకారులకు ఓ అలవాటుగా ఉంటుంది. తాజాగా స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెదరర్ వేలం నిర్వహిస్తానని చెప్పి ఓ బాల్ బాయ్ దాచుకున్న బంతిని అడగటం... దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వివరాల్లోకి వెళితే వింబుల్డన్ టోర్నీలో భాగంగా తొలి రౌండ్లో రోజర్ ఫెదరర్ ఉక్రెయిన్‌కి చెందిన ఆటగాడు అలెగ్జాండర్ దొల్గొపొలోవ్‌తో మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో మొదటి సెట్‌లో ఎనిమిదో గేమ్‌లో క్రాస్‌కోర్ట్ ఏస్ సంధించాడు. అది రోజర్ ఫెదరర్ తన కెరీర్‌లో సాధించిన 10,000 ఏస్.
ఈ విషయం గుర్తించిన బాల్ బాయ్ హ్యారిస్ ఖాన్ ఆ బంతిని తెచ్చుకుని తన వద్దే దాచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం బంతిని తనవద్దే ఉంచుకున్న హ్యారిస్ మీడియాకు ఇంటర్యూ ఇస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యలో అతడి వద్దకు వచ్చిన రోజర్ ఫెదరర్ జత కలిశాడు.

అప్పుడే 'ఆ బంతిని నాకు తిరిగిస్తావా. వేలం వేస్తాను' అని రోజర్ ఫెదరర్ బాల్ బాయ్‌ని అడిగాడు. వెంటనే హ్యారిస్ బంతిని ఫెదరర్‌కు ఇచ్చాడు. ఈ సందర్భంలో తాను రెండేళ్ల పాటు బాల్‌బాయ్‌గా చేశానని రోజర్ గుర్తు చేసుకున్నాడు. బాల్‌బాయ్స్‌గా ఉన్నప్పుడు స్టార్ ఆటగాళ్ల వస్తువులపై ఎంతో ఇష్టం ఉంటుందని చెప్పాడు
ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోని వింబుల్డన్ టోర్నీ నిర్వాహకులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వైరల్ అయింది.