వింబుల్డన్ టోర్నీలో వింత సమస్య: 'కోర్టు మధ్యలో గుంతను చూశా'
హైదరాబాద్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ సెమీస్ వరకు చేరుకుంది. అయితే వింబుల్డన్ టోర్నీలో ఓ సమస్య ఆటగాళ్లను వేధిస్తోందని క్రీడాకారులు వాపోతున్నారు. ముఖ్యంగా వింబుల్డన్ కోర్టుల్లో గడ్డిని చూసి చాలా మంది ఆటగాళ్లు భయపడుతున్నారు. రెండు రోజుల క్రితం అమెరికా స్టార్ క్రీడాకారిణి బెథానీ మాటెక్ మ్యాచ్ ఆడుతూ జారి పడి, తీవ్రంగా గాయపడింది.
ఈ సంఘటనను చూసిన ప్రతి ఒక్కరూ బెంబేలెత్తి పోతున్నారు. వింబుల్డన్ ట్రోఫీ సంగతి మాట అటుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి క్రీడాకారులు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో మిగతా క్రీడాకారుల గుండెల్లో గుబలు రేపుతోంది. స్టార్ సీడెడ్లు జొకోవిచ్, ఫెదరర్ సహా చాలా మంది క్రీడాకారులు ఇప్పటికే వింబుల్డన్ కోర్టుల నిర్వహణ తీరుపై ఫిర్యాదులూ చేశారు.

బెథానీ మాటెక్ కాలు మెలిక
మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో సిర్‌స్టియా (రుమేనియా)తో మ్యాచ్‌లో బెథానీ మాటెక్ బంతిని అందుకునేందుకు ముందుకు ఉరికి వచ్చినప్పుడు ఆమె కాలు మెలికపడింది. ఆమె తీవ్రమైన బాధతో కోర్టులోనే విలవిలలాడిపోయింది. వెంటనే బెథానీకి ఆక్సిజన్ అందించి, స్ట్రెచర్ మీద అంబులెన్స్ సాయంతో ఆసుపత్రి తీసుకెళ్లారు.

ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి
మోకాలికి తీవ్ర గాయం కావడంతో ఆమె ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వింబుల్డన్ కోర్టుల్లో పచ్చిక ఉండాల్సినంత లేదని క్రీడాకారుల పాదాలకు పట్టు చిక్కట్లేదని, అందుకే జారి కింద పడుతున్నామని క్రీడాకారులు చెబుతున్నారు. అయితే టోర్నీ సగం పూర్తి అయిన నేపథ్యంలో పచ్చిక కొంత వరకు పోయి, పాదాలకు పట్టు తగ్గడం సర్వ సాధారణమే.

ప్రభావం ఎక్కువగా ఉంది
అయితే ఈసారి మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉందని క్రీడాకారులు అంటున్నారు. 'తొలి రెండు మ్యాచ్‌ల సందర్భంగా నాకు కోర్టులో పెద్దగా మార్పు కనపడలేదు. కానీ మూడో రౌండ్ మ్యాచ్ సందర్భంగా మార్పు స్పష్టంగా గమనించాను. పచ్చిక బాగా మృదువుగా మారింది. ముఖ్యంగా బేస్ లైన్‌కు అటు ఇటు కొన్ని అడుగుల వరకు మైదానం ఏమంత బాగా లేదు' అని టాప్ సీడ్ జొకొవిచ్ పేర్కొన్నాడు.

గతంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు
అంతేకాదు వింబుల్డన్ టోర్నమెంట్‌లో ఇంతకుముందెప్పుడూ తనకు ఇలాంటి అనుభవం ఎందుకు కాలేదని కూడా అన్నాడు. ఎప్పుడూ పిచ్‌లు చాలా బాగా ఉండేవని ఈసారి మాత్రం అలా లేవని జొకోవిచ్ అన్నాడు. కోర్టు మధ్యలో సర్వీస్ లైన్ దగ్గరగా ఒక గుంతను గమనించానని.. దాన్ని ఛైర్ అంపైర్‌కు కూడా చూపించానని జకోవిచ్ తెలిపాడు.

తేలిగ్గా కొట్టిపారేసిన నిర్వాహకులు
వింబుల్డన్ నిర్వహకులు తయారు చేసిన కోర్టులు సురక్షితంగా లేవని చెప్పనప్పటికీ, ఫెదరర్ కూడా ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నాడు. అయితే వింబుల్డన్ నిర్వాహకులు మాత్రం ఆటగాళ్లు చెబుతున్నంత ప్రమాదకరంగా ఏమీ కోర్టులు లేవని తేలిగ్గా కొట్టిపారేశారు.

ఎటువంటి సమస్య లేదు
క్రీడాకారులు చెబుతున్నట్లు బేస్‌లైన్ దగ్గర సమస్య ఉన్నట్లు మాకేమీ అనిపించలేదని వింబుల్డన్ కోర్టులను పర్యవేక్షిస్తున్న నీల్ స్టబ్లే వ్యాఖ్యానించాడు. అయితే నిపుణులు మాత్రం ఈసారి వింబుల్డన్ టోర్నీలో ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణంలో తేమ శాతం తగ్గి పచ్చిక జీవం కోల్పోయిందని, అందుకే క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications