యుఎస్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించింది: ఎవరీ నవోమీ ఒసాకా

హైదరాబాద్: నవోమీ ఒసాకా.... ఇప్పుడు ప్రపంచ టెన్నిస్‌లో కొత్తగా వినిపిస్తోన్న పేరు. అందుకు కారణం ఆరు సార్లు యుఎస్ ఓపెన్ గెలిచిన సెరెనా విలియమ్స్‌ను యుఎస్ ఓపెన్‌లో చిత్తుగా ఓడించడమే. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎవరూ ఊహించని విధంగా జపాన్‌కు చెందిన నవోమీ ఒసాకా టైటిల్ విజేతగా అవతరించిన సంగతి తెలిసిందే.
1995 అక్టోబర్ 28... అప్పుడు 14 ఏళ్ల సెరెనా విలియమ్స్ తొలి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడిన రోజు.
1997 అక్టోబర్ 16... యూఎస్ ఓపెన్ మహిళల టైటిల్ విజేత నవోమీ ఒసాకా పుట్టినరోజు.
దీనిని బట్టి సెరెనా విలియమ్స్ ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడే సమయానికి నవోమీ ఒసాకా ఇంకా పుట్టనేలేదు. సెరెనా విలియమ్స్ అనుభవం అంత లేదు ఒసాకా వయస్సు. అలాంటి ఒసాకా టెన్నిస్‌లో అత్యంత అనుభవజ్ఞురాలైన సెరెనాను ఫైనల్ మ్యాచ్‌లో గడగడలాడించింది. దీంతో ఎవరీ ఒసాకా అంటూ నెజినట్లు ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
జపాన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్
నవోమీ ఒసాకా ఓ జపనీస్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. అయితే ఆమెకు అమెరికన్ సిటిజన్‌షిప్ కూడా ఉంది. సెరెనాపై యుఎస్ ఓపెన్ నెగ్గడంతో తొలి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ గెలిచిన జపాన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఒసాకా తల్లి జపనీస్ కాగా, తండ్రి హైతియన్. ప్రస్తుతం ఒసాకా జపాన్‌లోనే నివసిస్తోంది. నవోమీ సోదరి మారీ కూడా టెన్నిస్ ప్లేయరే. ఇధ్దరూ డబుల్స్ మ్యాచ్‌లు ఆడారు. జపాన్ టెన్నిస్ అసోసియేషన్‌లో రిజిస్టర్ చేసుకున్న నవోమీ... 2013లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారింది.
నవోమీ రోల్ మోడల్ ఎవరో కాదు
అయితే, ఇక్కడ నవోమీ రోల్ మోడల్ ఎవరో కాదు... సెరెనా విలియమ్సే. రాకెట్ పట్టిన తొలి రోజు నుంచి సెరెనాను అభిమానిస్తోంది. 2014లో ఓ సందర్భంలో సెరెనాతో సెల్ఫీ దిగి మురిసిపోయింది. ఇప్పుడు అదే సెరెనాను యుఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడించడంతో భావోద్వేగానికి గురైంది. మ్యాచ్ అనంతరం ఒసాకా మాట్లాడుతూ "కోర్టులో అడుగుపెట్టేటప్పుడు నేను సెరెనా అభిమానిని కాదు. ఈ మ్యాచ్‌ని తాను మరొక టెన్నిస్ ప్లేయర్‌తో ఆడినట్లే ఆడా. మ్యాచ్ ముగిసిన తర్వాత సెరెనా ఎప్పుడైతే నన్ను హత్తుకుందో నేను చిన్నపిల్లని అయిపోయా" అని ఉబికి వస్తోన్న కన్నీళ్లతో ఒసాకా తెలిపింది.

సంచలన ప్లేయర్‌గా రికార్డులు
నవోమీ రాకెట్ పట్టిన తొలినాళ్ల నుంచే సంచలన ప్లేయర్‌గా రికార్డులు సృష్టించింది. 2015లో టాప్-50 ర్యాంకింగ్‌లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా గ్రాండ్‌స్లామ్‌లో అడుగుపెట్టి మూడో రౌండ్ వరకు వెళ్లింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా మూడో రౌండ్‌కు చేరుకుంది. 2016 యుఎస్ ఓపెన్‌లో కూడా మూడో రౌండ్ వరకు వెళ్లింది. ఆ తర్వాత 2017లో వింబుల్డన్‌లో అడుగుపెట్టింది. మూడో రౌండ్‌లో వీనస్ విలియమ్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ ఏడాది నవోమీ ర్యాంక్ 68. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేయడంతో కొన్ని నెలల్లోనే ఏకంగా 7వ ర్యాంకు వరకు చేరుకుంది.
2018 మార్చిలోనే సెరెనాను ఓడించిన నవోమీ ఒసాకా
2018 మార్చిలో మియామీ ఓపెన్‌లో తన అభిమాన ప్లేయర్ సెరెనా విలియమ్స్‌తో తొలిరౌండ్‌లో పోటీపడింది. వాస్తవానికి సెరెనాకు నవోమీ తొలిసారిగా చుక్కలు చూపించింది ఈ గ్రాండ్ స్లామ్‌లోనే. ఆ మ్యాచ్‌లో సెరెనాపై 6-3, 6-2 తేడాతో నవోమీ ఒసాకా గెలిచి సంచలనం సృష్టించింది. అప్పుడు సెరెనా విలియమ్స్ ర్యాంక్ నెంబర్ వన్ కాగా, ఒసాకా ర్యాంక్ 22. తాజగా ఇప్పుడు 137 ఏళ్ల యుఎస్ ఓపెన్ చరిత్రలో నవోమీ ఒసాకా ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఒసాకా ప్రీ క్వార్టర్ ఫైనల్ దాటితేనే గొప్ప అనుకున్నారు. కానీ ఫైనల్‌కు చేరింది. అలాంటిది ఫైనల్లో సెరెనాపై విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications