హైదరాబాద్: జూన్ 9న ఫ్లోరిడాలో వీనస్ విలియమ్స్ డ్రైవ్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ రోడ్డు ప్రమాదంలో వీనస్ విలియమ్స్ కారు మరో కారుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన జెరోమ్ బార్సన్ (79) అనే వృద్ధుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వారాల తర్వాత మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్లోరిడాలోని పామ్ బీచ్ గార్డెన్స్ పోలీసులు వీనస్ విలియమ్స్‌ను అరెస్ట్ చేయలేదు. అయితే ఈ ప్రమాద ఘటనలో వీనస్ తప్పు ఉందని అనుకున్నారు.
అయితే ఇప్పుడు ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కొత్త వీడియోను పామ్ బీచ్ పోలీసులు విడుదల చేశారు. ఈ వీడియో ప్రకారం ఆ రోడ్డు ప్రమాదానికి వీనస్ విలియమ్స్ కారణం కాదు అని పోలీసులు తేల్చారు. ఈ మేరకు పామ్ బీచ్ పోలీసులు అధికారిక ప్రకటన చేశారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం జంక్షన్ దగ్గర గ్రీన్ లైట్ కోసం వేచి చూసిన వీనస్.. ఆ తర్వాతే తన కారును ముందుకు నడిపింది. ఆ సమయంలో మరో రూట్లో వేగంగా వచ్చిన కారు వీనస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 79 ఏళ్ల వృద్ధుడు జెరోమ్ బార్సన్ తీవ్రంగా గాయపడ్డాడు.
కారు నడుపుతున్న జెరోమ్ భార్య లిండా బార్సన్ కూడా గాయపడటంతో స్థానికులు వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయమైన జెరోమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 14 రోజుల తర్వాత మరణించాడు. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.
కారు నడుపుతున్న సమయంలో వీనస్ విలియమ్స్ ఫోన్ మాట్లాడటం, డ్రగ్స్, ఆల్కహాల్ లాంటివి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదంలో మృతిచెందిన కారు డ్రైవర్‌కు సంబంధించిన కుటుంబసభ్యులు మాత్రం వీనస్‌పై నష్టపరిహారం కేసు వేశారు.
ఈ ప్రమాద ఘటనపై ఇటీవలే ప్రారంభమైన వింబుల్డన్ టోర్నీలో మీడియా వీనస్ విలియమ్స్‌ని మీడియా ప్రశ్నించగా ఆమె కన్నీటి పర్యంతమైంది 'ఆ సంఘటనపై స్పందించేందుకు నా నోట మాటలు రావడంలేదు. ఆట మాత్రమే నా చేతుల్లో ఉంటుంది. జీవితంలో రేపు ఏం జరుగుతుందో చెప్పలేను' అని వీనస్ వ్యాఖ్యానించింది.