25వ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంగా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో మాల్దోవా ప్లేయర్ అల్బాట్‌పై రెండో సీడ్ జకోవిచ్ విరుచుకుపడ్డాడు. 6-2, 6-2, 6-4తో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాడు. 2 గంటల ఏడు నిమిషాలు పాటు సాగిన ఈ పోరులో జకోవిచ్ ఎనిమిది ఏస్‌లు, 23 విన్నర్లు కొట్టాడు.
కాగా, ఫ్లషింగ్ మెడోస్‌లో జకోవిచ్‌కు ఇది 89 విజయం. ఈ క్రమంలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో ఫెడరర్ అత్యధిక విజయాల రికార్డును జకో సమం చేశాడు. కాగా, జకోవిచ్ మరో టైటిల్ సాధిస్తే మార్గరెట్ కోర్ట్ (24)ను దాటి అత్యధికంగా 25 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడనే విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో జకోవిచ్ స్వర్ణంతో సత్తాచాటి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

మరోవైపు జ్వెరెవ్ (జర్మనీ), రుబ్లెవ్ (రష్యా), రూడ్ (నార్వే), దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మార్టెరర్ (జర్మనీ)పై జ్వెరెవ్ 6-2, 6-7 (5-7), 6-3, 6-2తో నెగ్గాడు. సెబోత్ వైల్ట్ (బ్రెజిల్)పై 6-3, 7-6 (7-3), 7-5తో రుబ్లెవ్ పైచేయి సాధించాడు. రూడ్ 7-6 (7-2), 6-2, 6-2తో యుంచావ్‌కెట్ బు (చైనా)పై, దిమిత్రోవ్ 6-3, 6-4, 6-2తో జకెట్ (ఫ్రాన్స్)పై గెలిచారు.
ఇక మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), నంబర్ వన్ స్వియాటెక్ (పోలాండ్), రెండో సీడ్ సబలెంక (బెలారెస్) రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. గ్రచెవా (ఫ్రాన్స్)పై 6-2, 6-0తో కోకో గాఫ్, ప్రిసిల్లా (ఆస్ట్రేలియా)పై సబలెంక 6-3, 6-3తో, రఖిమోవా (రష్యా)పై స్వియాటెక్ 6-4, 7-6 (8/6)తో గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో బరిలోకి దిగిన భారత ఆటగాడు సుమిత్ నగాల్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. నెదర్లాండ్స్ ప్లేయర్ టాలన్ గ్రీక్‌స్పూర్ చేతిలో 1-6, 3-6, 6-7 (8)తో ఓటమి చవిచూశాడు.