యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్టార్ ప్లేయర్లు అలెగ్జాండర్ జ్వెరెవ్, కసట్‌కినా, స్విటోలినా శుభారంభం చేశారు. మరోవైపు సక్కారి, థీమ్ ఆదిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో జర్మనీ ఆటగాడు, వరల్డ్ నాలుగో ర్యాంకర్ జ్వెరెవ్.. తమ దేశ ప్లేయరే అయిన మాక్సిమిలన్ మార్టెరర్‌పై 6-2, 6-7 (5/7), 6-3, 6-2తో విజయం సాధించాడు.
2 గంటల 53 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జ్వెరెవ్ విజృంభించాడు. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. 21 ఏస్‌లు కొట్టాడు. ఇక హంబెర్ట్ (ఫ్రాన్స్) కూడా శుభారంభం చేశాడు. మాంటీరో (బ్రెజిల్) 6-3, 6-4, 6-4తో ఓడించాడు. అయితే2020 ఛాంపియన్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తొలి రౌండ్‌లో ఇంటిముఖం పట్టాడు. బెన్ షెల్టన్ (అమెరిక) చేతిలో 4-6, 2-6, 2-6తో ఓటమి చవిచూశాడు.

ఇక మహిళల సింగిల్స్‌లో రష్యా స్టార్ కసట్కినా శుభారంభం చేసింది. రొమేనియా క్రీడాకారిణి జాక్వెలిన్ క్రిస్టియన్‌ను 6-2, 6-4తో ఓడించింది. జాక్వెలిన్ క్రిస్టియన్ 31 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకోవడం గమనార్హం. కసట్కినాతో పాటు ఆంద్రీవా (రష్యా), వెకిచ్ (క్రొయేషియా) కూడా రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. యువాన్ (చైనా)పై 6-3, 7-6 (9-7)తో ఆంద్రీవా, ఆస్ట్రేలియా అమ్మాయి బిరెల్‌పై వెకిచ్ 6-4, 6-4తో విజయం సాధించారు.
అయితే గ్రీస్ ప్లేయర్, తొమ్మిదో సీడ్ సకారి గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. చైనా ప్లేయర్ యుఫాన్ వాంగ్‌తో జరిగిన పోరులో తొలి సెట్‌ను సకారి 2-6తో కోల్పోయింది. ఈ దశలో గాయం కారణంగా సాకరి తప్పుకుని ప్రత్యర్థి వాంగ్‌కు వాకోవర్ ఇచ్చింది.