యూఎస్ ఓపెన్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా సంచలనాలు నమోదవుతున్నాయి. ఇటీవలే నాలుగో సీడ్ హోల్గర్ రూన్ తొలి రౌండ్‌లోనే ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే గతేడాది రన్నరప్ క్యాస్పర్ రూడ్ కూడా టోర్నీ నుంచి వైదొలిగాడు. రెండో రౌండ్‌లో రూడ్ పోరాడి ఓడాడు. అతనని చైనాకు చెందిన జాంగ్ జిజెన్ ఓడించి చరిత్ర సృష్టించాడు.
అతనే కాదు గ్రీకువీరుడు సిట్సిపాస్, మరో స్టార్ పెట్రా క్విటో వా కూడా రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టడం గమనార్హం. గురువారం నాడు జరిగిన రెండో రౌండ్ మ్యాచులో ఐదో సీడ్ అయిన నార్వే స్టార్ క్యాస్పర్ రూడ్.. చైనా ప్లేయర్ జాంగ్ జిజెన్‌తో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 4-6, 7-5, 2-6, 6-0, 2-6తో జాంగ్ జిజెన్ విజయం సాధించాడు. ఈ క్రమంలో టాప్-5 ర్యాంక్ ఆటగాడిని ఓడించిన తొలి చైనా ప్లేయర్‌గా జాంగ్ హిస్టరీ క్రియేట్ చేశాడు.

అలాగే టోర్నీలో ఏడో సీడ్ అయిన సిట్సిపాస్ కూడా కంగుతిన్నాడు. డొమినిక్ స్టీఫెన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 5-7, 7-6(2), 7-6(5), 6-7(6), 3-6 తేడాతో సిట్సిపాస్ ఓటమిపాలయ్యాడు. ఒక మిగతా మ్యాచుల్లో రెండో సీడ్ అయిన జకోవిక్ మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. స్పెయిన్‌కు చెందిన బెర్నబే జపాటాను 6-4, 6-1, 6-1 తేడాతో వరుస సెట్లలో జకోవిక్ ఓడించాడు. అమెరికా స్టార్ టేలర్ ఫ్రిట్జ్ కూడా 6-1, 6-2, 6-2తో పాబ్లోపై నెగ్గి ముందడుగు వేశాడు.
అదే సమయంలో మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్, పోలెండ్ స్టార్ ఇగా స్వియటెక్ 6-3, 6-4 తేడాతో ఆస్ట్రేలియా ప్లేయర్ డారియా సివెల్లిపై గెలుపొందింది. 10వ సీడ్ ముచోవా 6-3, 6-3తో మగ్దలీనా ఫ్రెచ్‌ను ఓడించింది. ఓస్టపెంకో, జు లిన్ కూడా ముందడుగు వేశారు. అయితే 11వ సీడ్ పెట్రా క్విటోవా మాత్రం 5-7, 6-7(5) తేడాతో కరోలిన్ వోజ్నియాకి చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది.