టెన్నిస్ వీరుడు నొవాక్ జకోవిక్ మరో సంచలనం సృష్టించాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో రష్యన్ స్టార్ డానిల్ మెద్వెదేవ్‌ను ఓడించి టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన టెన్నిస్ ప్లేయర్‌గా లెజెండరీ స్టార్ మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేశాడు. ఇది జకోవిక్ కెరీర్‌లో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం గమనార్హం.
ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ మూడు టైటిల్స్ సాధించిన ఈ సెర్బియన్ స్టార్ మళ్లీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. సోమవారం కొత్తగా విడదలయ్యే ర్యాంకింగ్స్‌లో అతనే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోనున్నాడు. అంతేకాదు, అత్యంత పెద్ద వయసులో యూఎస్ ఓపెన్ గెలిచిన ప్లేయర్‌గా కూడా ఈ 36 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్ రికార్డు సృష్టించాడు.

ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో జకోవిక్ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. మెద్వెదేవ్‌ను 6-3, 7-6 (5), 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి టైటిల్ సాధించాడు. 'ఈ విజయం నా సర్వస్వం. నేను చిన్నతనంలో కన్న కల ఇప్పుడు సాకారమైంది' అని ఈ విజయం తర్వాత జకోవిక్ అన్నాడు.
'ఈ క్రీడలో చరిత్ర సృష్టించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పడం చాలా కష్టం. నాకు 7-8 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్ అవ్వాలని కలలు కనేవాడిని' అని జకోవిక్ చెప్పుకొచ్చాడు. పురుషుల్లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన ప్లేయర్‌గా ఇప్పటికే అందరి కంటే ముందున్న జకోవిక్.. యూఎస్ ఓపెన్ విజయంతో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన ప్లేయర్‌గా మార్గరెట్ రికార్డును సమయం చేశాడు.
ఇక మహిళల సింగిల్స్ విభాగంలో యూఎస్ ప్లేయర్ కోకో గాఫ్ కూడా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 19 ఏళ్ల ఆమె ప్రపంచ నెంబర్ వన్ అరీనా సబలెంకను ఫైనల్‌లో ఓడించి మహిళల సింగిల్స్ టైటిల్ సాధించింది. ఇది ఆమె కెరీర్‌లో తొలి యూఎస్ ఓపెన్ టైటిల్ కావడం గమనార్హం.