
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ 2020లో ఆస్ట్రియా క్రీడాకారుడు డొమినిక్ థీమ్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం రాత్రి హోరాహోరీగా సాగిన తుది పోరులో జర్మనీ యువ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై థీమ్ అద్భుతమైన విజయం సాధించి యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఫైనల్‌లో 2-6, 4-6, 6-3, 7-6 తేడాతో గెలుపొందాడు. దీంతో యూఎస్ ఓపెన్ గెలిచిన తొలి ఆస్ట్రియా క్రీడాకారుడిగా రికార్డు సాధించాడు.
వరల్డ్ నెంబర్‌వన్ నోవాక్ జొకోవిచ్ అనూహ్య నిష్క్రమణతో హాట్ ఫేవరెట్‌గా మారిన రెండో సీడ్ డొమినిక్ థీమ్ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తూ వచ్చాడు. తొలి రెండు సెట్లలో వెనుకబడ్డ థీమ్.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్నాడు. వరుసగా మూడు సెట్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి కెరీర్‌లో తొలి యూఎస్ గ్రాండ్ స్లామ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తొలి రెండు సెట్లలో వెనుకబడిన ఆటగాడు టైటిల్ నెగ్గడం యూఎస్ ఓపెన్ చరిత్రలో ఇదే తొలిసారి.
గ్రాండ్ స్లామ్ వేటలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరిన డొమినిక్ థీమ్ ఎట్టకేలకు యూఎస్ ఓపెన్‌తో ఆ కల నెరవేర్చుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ ఫైనల్‌కు చేరినప్పటికీ.. నోవాక్ జొకోవిచ్ చేతిలో ఓటమి చవిచూశాడు. అంతుకుముందు 2018, 2019లో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచాడు. 90వ దశకంలో పుట్టి గ్రాండ్ స్లామ్ నెగ్గిన తొలి ఆటగాడూ డొమినికే కావడం విశేషం. ఫైనల్లో థీమ్ విజయం సాధించి థామస్ ముస్టర్ (1995లో ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన రెండో ఆస్ట్రియా ఆటగాడిగానూ గుర్తింపు సాధించాడు.
స్టార్ క్రీడాకారిణి, నాలుగో సీడ్ నవోమి ఒసాక యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో ఒసాక 1-6, 6-3, 6-3తో మాజీ నెంబర్‌వన్ విక్టోరియా (బెలార్‌స)ను ఓడించింది. విజేతగా నిలిచిన ఒసాకకు రూ.22 కోట్ల ప్రైజ్‌మనీ, రన్నర్‌ప అజరెంకాకు రూ.11 కోట్లు దక్కాయి. ఒసాక కెరీర్‌లో ఇది రెండో యూఎస్ ఓపెన్ కాగా.. ఓవరాల్‌గా ఆమెకిది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 22ఏళ్ల ఒసాక గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన ప్రతిసారీ విజేతగా నిలవడం విశేషం.