
న్యూయార్క్: డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, ఐదుసార్లు విజేత రోజర్ ఫెదరర్ యూఎస్ ఓపెన్ టోర్నీ నుండి నిష్క్రమించగా.. రెండోసీడ్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ టైటిల్ దిశగా దూసుకుపోతున్నాడు. ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్‌లో నాదల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. దీంతో టాప్-3లో నాదల్ ఒక్కడే నిలిచాడు. ఇప్పటికే మూడు సార్లు (2010, 2013, 2017) చాంపియన్ అయిన నాదల్ నాలుగో టైటిల్‌పై కన్నేశాడు. ఇక మహిళల సింగిల్స్‌లో కెనడా టీనేజర్ బియాంక ఆండ్రీస్కూ సెమీస్ చేరి సంచలనం సృష్టించింది.
గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 6-4, 7-5, 6-2తో అర్జెంటీనాకు చెందిన 20వ సీడ్ డీగో ష్వార్జ్‌మన్‌పై విజయం సాధించాడు. 2 గంటల 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్‌కు రెండో సెట్ మినహా.. ఎక్కడ పోటీ ఎదురవలేదు. ఆఖరి సెట్‌నైతే ఏకపక్షంగా ముగించేశాడు. గతేడాది కూడా సెమీస్ చేరిన నాదల్.. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో 33 సార్లు సెమీఫైనల్ చేరాడు. ప్రస్తుతం అతని కంటే ముందు వరుసలో ఫెదరర్ (45), జొకోవిచ్ (36)లు ఉన్నారు. మరో క్వార్టర్ ఫైనల్ పోరులో ఇటలీకి చెందిన 24వ సీడ్ మాటెయో బెరెటిని 3-6, 6-3, 6-2, 3-6, 7-6 (7/5)తో ఫ్రాన్స్ ఆటగాడు, 13వ సీడ్ గేల్ మోన్‌ఫిల్స్‌పై విజయం సాధించాడు. మీఫైనల్లో నాదల్‌తో బెరెటిని తలపడతాడు.
కెనడా టీనేజ్ అమ్మాయి బియాంక అండ్రిస్కూ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 15వ సీడ్‌గా బరిలోకి దిగిన అండ్రిస్కూ 3-6, 6-2, 6-3తో బెల్జియంకు చెందిన ఎలైస్ మెర్టెన్స్‌ను ఓడించింది. 2 గంటల 2 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో రెండు ఏస్‌లే సంధించిన బియంకా 40 విన్నర్లతో సత్తా చాటింది. ఈ విజయంతో 2009లో వోజ్నియాకి తర్వాత యూఎస్ ఓపెన్ సెమీస్ చేరిన తొలి టీనేజర్‌గా బియాంక రికార్డు సృష్టించింది. శుక్రవారం జరిగే సెమీస్ మ్యాచులో 13వసీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్)ను బియాంక ఢీకొననుంది.