మాంటెనీగ్రో: సెర్బియన్ టెన్నీస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఓ ఇంటి వాడయ్యాడు. ఇటీవలే వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌తోపాటు మళ్లీ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను కూడా సొంతం చేసుకున్న నొవాక్ జకోవిచ్ వివాహం తన స్నేహితురాలు జెలెనా రిస్టిక్‌తో ఇక్కడి ఓ ఐదు నక్షత్రాల రిసార్ట్‌లో జరిగింది.
జూన్ 14వ తేదీన వీరి వివాహం జరగాల్సి ఉండగా, వింబుల్డన్ టోర్నీని దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసుకున్నారు. ఆండీ ముర్రే, సారా ఫెర్గూసన్, రిచర్డ్ బ్రాస్నన్, మరియా షరపోవా, సెర్బియాకే చెందిన జన్కొ తిప్సారెవిచ్, అతని జీవిత భాగస్వామి బిల్జానా వంటి అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జకోవిచ్, జెలెనా వివాహం జరిగింది.

జకోవిచ్ వెన్నంటే ఉండే రిస్టిక్ చాలా టెన్నిస్ ప్రేక్షకులకు పరిచయస్థురాలే. అతని మ్యాచులన్నంటికీ ఆమె హాజరవుతూ ఉంటుంది. చారిటీ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంటుంది. అతని చారిటబుల్ ట్రస్టుకు ఆమె డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది.
2012 వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్న తర్వాత జకోవిచ్ తన అగ్రస్థానాన్ని ఇటీవల తిరిగి నిలబెట్టుకున్నాడు. జకోవిచ్ తన ఆత్మకథ పుస్తకాన్ని గతంలో విడుదల చేశాడు. సర్వ్ టు విన్ పేరిట విడుదల ఈ పుస్తకంలో తాను తీసుకునే భోజన పదార్థాల గురించి, శిక్షణ గురించి వివరించాడు.