హైదరాబాద్: మాజీ టెన్నిస్ స్టార్ బోరిక్ బెకర్ దివాలా తీశాడు. జర్మనీకి చెందిన బోరిస్ బెకర్ దీర్ఘకాలంగా అప్పు చెల్లించకపోవడంతో అతడు దివాలా తీసినట్లు బ్రిటిష్ కోర్టు ప్రకటించింది. 49 ఏళ్ల బెకర్ తన కెరీర్‌లో అరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచాడు. ఇటీవల నొవాక్ జకోవిచ్‌కు కోచ్‌గా బెకర్ వ్యవహరించాడు.
జర్మనీలో జన్మించిన బెకర్ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నాడు. 2015లో బ్యాంకు నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణానికి చెల్లింపులు చేయడంలో విఫలమౌతున్న బెకర్‌ను తీవ్రంగా విమర్శిస్తూ కోర్టు రిజిస్ట్రార్ క్రిస్టీన్ డెరెట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

అప్పులు చెల్లించడానికి మరొక్క అవకాశం కల్పించాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించినప్పటికీ కోర్టు తోసిపుచ్చింది. బెకర్‌కు రుణాన్ని అందించిన ప్రైవేట్ బ్యాంకు లాథమ్ అండ్ కో కోర్టులో కేసు వేయడంతో విచారణ కొనసాగుతోంది.
బీబీసీ, మిగతా మీడియా ఛానెళ్లలో టీవీ పండిట్‌గా కొనసాగుతోన్న బెకర్ మరో నెలలో స్పెయిన్ బ్యాంక్‌తో ఒప్పందం ద్వారా 6 మిలియన్ల యూరోలను రుణంగా తీసుకుని చెల్లింపులు చేస్తాడని ఆయన తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేసినా రిజిస్ట్రార్ అంగీకరించక పోవడం విశేషం.