ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత్ ప్లేయర్ సుమిత్ నగాల్ సంచలన ప్రదర్శన చేశాడు. మెన్స్ సింగిల్స్‌లో కజికిస్థాన్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు అలెగ్జాండర్ బబ్లిక్‌ను మట్టికరిపించాడు. 6-4, 6-2, 7-6 (5)తో వరుస సెట్లలో గెలిచి చరిత్ర సృష్టించాడు. 1989 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఓ సీడెడ్ ప్లేయర్‌ను భారత ఆటగాడు ఓడించడం ఇదే తొలిసారి.
అంతకుముందు ఈ ఘనత రమేశ్ కృష్ణన్ సాధించాడు. 1989లో అప్పటి ప్రపంచ నంబర్ వన్ మ్యాట్స్ విలాండర్‌ను రెండో రౌండ్‌లో అతడు ఓడించడం విశేషం. అయితే సుమిత్ నగాల్ ర్యాంక్ 139 కాగా, అలెగ్జాండర్ జబ్లిక్ ర్యాంక్ 27 కావడం గమనార్హం. జబ్లిక్‌ను ఓడించిన రెండో రౌండ్‌లో దూసుకెళ్లిన సుమిత్ తర్వాత మెకెంజీ మెక్‌డొనాల్డ్, షాంగ్ జున్‌చెంగ్ లతో తలపడనున్నాడు.

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సుమిత్ నగాల్ చివరిగా 2021 సీజన్‌లో మెయిన్ డ్రా ఆడాడు. కానీ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ఇక 2019, 2020లో యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాలోనూ సుమిత్ పోరాడాడు. 2020 సీజన్‌లో అతడు రెండో రౌండ్ వరకు చేరుకున్నాడు.

అయితే ఆస్ట్రేలియా ఓపెన్‌లో మెన్స్ సింగిల్స్‌లో భారత క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శన మూడో రౌండ్‌కు చేరుకోవడం మాత్రమే. రమేశ్ కృష్ణన్ గతంలో అయిదు సార్లు మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. 1983, 1984 సీజన్లతో పాటు 1987 నుంచి వరుసగా మూడు సార్లు మూడో రౌండ్‌కు చేరుకోవడం విశేషం. ఇండియన్ ప్లేయర్లు లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్‌కే పరిమితమయ్యారు.