
వింబుల్డన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అలెగ్జాండర్ జ్వెరెవ్, సిట్సిపాస్, నయోమి ఒసాకా, వీనస్ విలియమ్స్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఇంటిబాట పట్టగా.. మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (19వ ర్యాంకు) కూడా వీరి దారిలోనే నడిచాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో అమెరికాకు చెందిన రేలీ ఓపెల్కా (63వ ర్యాంకు) చేతిలో చివరి వరకు హోరాహోరీగా పోరాడి 5-7, 6-3, 6-4, 4-6, 6-8 తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మొత్తం 3గంటల13 నిమిషాలు జరిగిన మ్యాచ్‌లో 23 ఏస్‌లు, 59 విన్నర్లతో ఓపెల్కా దూసుకెళ్లాడు. వావ్రింకాకు షాకిచ్చి తొలిసారి గ్రాండ్‌స్లామ్ మూడోరౌండ్ చేరాడు. మరో మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన ఎఫ్.లోపేజ్(54)పై కె.కచనోవ్(రష్యా,9) 4-6, 6-4, 7-5, 6-4తో కష్టపడి నెగ్గాడు. 11వ సీడ్ మెద్వెదేవ్ 6-7(6), 6-1, 6-4, 6-4తో పొపిరిన్‌పై, 15వ సీడ్ రవోనిక్ 7-6(1), 7-5, 7-6(4)తో రాబిన్ హాస్‌పై గెలిచి మూడోరౌండ్లో అడుగుపెట్టారు.
మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ కరోలినా ప్లిస్కోవా వింబుల్డన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. మూడోసీడ్ ప్లిస్కోవా 6-0, 6-4తో మోనికా పెగ్‌ను ఓడించి మూడోరౌండ్‌కు చేరుకుంది. 8వ సీడ్ స్విటోలినా 5-7, 6-5తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి గాస్పర్యాన్ రిటైర్డ్ హర్ట్ కావడంతో మూడోరౌండ్ చేరింది. హలెప్ 6-3, 4-6, 6-2తో బుజారానెస్కుపై చెమటోడ్చి నెగ్గింది. అజరెంకా 6-2, 6-0తో టామ్‌జనోవిచ్‌పై నెగ్గగా.. తొలిరౌండ్లో ఒసాకాకు షాకిచ్చిన పుటింట్సెవా 6-7(3), 4-6తో గోలుబిచ్ చేతిలో ఓడింది.