
క్రీడరంగానికి, దేశానికి ఏదో కొంత ఇవ్వాలని తాను గత కొన్నేళ్లుగా ఆలోచిస్తున్నానని, ఏదో మార్గంలో తన వంతుగా అందించాలని అనుకుంటున్నానని సానియా మీర్జా అన్నారు. టెన్నిస్ క్రీడలో పైకి రావడానికి ప్రయత్నించే క్రీడాకారులకు ఓ వేదికను కల్పించి, వారికి తన అనుభవాన్ని పంచాలని అనుకుంటున్నట్లు ఆమె ఓ వార్తా సంస్థ ప్రతినిధితో చెప్పారు.
తన అకాడమీ నుంచి వచ్చే ఐదేళ్లలోనో, పదేళ్లలోనో, 12 ఏళ్లలోనో మంచి క్రీడాకారులు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అకాడమీ నాలుగు ఎకరాల్లో ఏర్పాటవుతోందని, ఇందులో 9 హార్డ్ కోర్టులుంటాయని, తర్వాత క్రమంగా మూడు క్లే కోర్టులతో పాటు మరో తొమ్మిది హార్డ్ కోర్టులు వస్తాయని ఆమె వివరించారు.
తాము స్పాన్సరర్స్ కోసం చూస్తున్నామని, అకాడమీలో శిక్షణ తీసుకోవడం సులభం అవుతుందని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా అన్నారు. సొమ్ము విషయంలో అందుబాటులో ఉండేలా చూడాలనేది తమ ఉద్దేశ్యమని చెప్పారు. తన ఆటతీరుతో ఇప్పటి వరకు సంతృప్తిగానే ఉన్నట్లు సానియా చెప్పారు. అయితే, టెన్నిస్ క్రీడాకారులకు ఎప్పటికీ సంతృప్తి ఉండదని, ఇంకా ఆడాలని ఆశిస్తామని అన్నారు.
తన భర్త షోయబ్ మాలిక్, తాను రియాల్టీ షోలో పాల్గొంటున్నట్లు జరిగిన ప్రచారాన్ని ఆమె ఖండించారు.