హైదరాబాద్: 18 నెలల నిషేధం ముగిసిన తర్వాత మాజీ వరల్డ్ నెంబర్, రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా తొలి గ్రాండ్‌స్లామ్‌లో ఆడాలన్న ఆశ ఎట్టకేలకు తీరింది. షరపోవాకు యుఎస్ ఓపెన్ వైల్డ్‌కార్డ్ లభించింది. ఈ మేరకు యుఎస్ ఓపెన్ ప్రతినిధులు అధికారిక ప్రకటన చేశారు.
నిషేధిత ఉత్ప్రేరకం వాడినందుకు 15 నెలల నిషేధానికి గురైన షరపోవా ఏప్రిల్‌లో తిరిగి కోర్టులో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే నిషేధం ముగిసినప్పటికీ ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ఆమెకు వైల్డ్‌కార్డ్ ఇచ్చేందుకు తిరస్కరించారు. అంతకముందు వైల్డ్‌కార్డ్‌ల ఎంట్రీతోనే స్టట్‌గార్ట్, మాడ్రిడ్, రోమ్ వంటి టోర్నీల్లో షరపోవా ఆడింది.
30 ఏళ్ల షరోపోవాకు వైల్డ్ కార్డ్ ఇవ్వడాన్ని చాలా మంది ఆటగాళ్లు వ్యతిరేకించారు. గాయం కారణంగా వింబుల్డన్ క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి షరపోవా తప్పుకున్న షరపోవా ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 148వ ర్యాంకులో ఉంది. షరపోవాతో పాటు అమెరికాకు చెందిన టేలర్ టౌన్సెండ్, క్యాలా డే, సోఫియా కెనిన్, ఆష్లే క్రాట్జర్, బ్రియాన్నే మైనర్, అమన్దినే హెస్సీలకు వైల్డ్ కార్డు ఎంట్రీ లభించింది.