హైదరాబాద్: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌పై మాజీ టెన్నిస్ దిగ్గజం జాన్ మెకన్రో నోరు పారేసుకున్నాడు. టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్ స్లామ్స్ (23) సాధించిన సెరెనా విలియమ్స్ పై మెకన్రో అనవసర వ్యాఖ్యలు చేశాడు. పురుషుల టెన్నిస్‌లో ఆడినైట్లెతే సెరెనా 700 ర్యాంక్‌లో ఉంటుందనీ.. 701వ ర్యాంకర్ కూడా ఆమెను సులువుగా ఓడిస్తాడంటూ మెకన్రో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
అంతేకాదు సెరెనా అద్భుతమైన ప్లేయర్ కాదు అని నేను అనడం లేదని కూడా పేర్కొన్నాడు. 'పురుషుల టెన్నిస్ సర్క్యూట్‌లో ఆమె పోటీపడితే 700 ర్యాంక్‌లో ఉంటుంది. పురుషులతో మహిళలకు పోటీ ఊహాజనితమైనా.. వాళ్లతో ఆడితే సెరెనా కథ మరోలా ఉంటుంది' అని 58 ఏళ్ల జాన్ మెకన్రో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.

అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన తర్వాత మెకన్రో ప్రస్తుతం టెన్నిస్ పండిట్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే తన తాజా బుక్ ప్రమోషన్‌లో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసాడని అంటున్నారు. ఇదిలా ఉంటే తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సెరెనా విలియమ్స్ స్పందించింది.
'ప్రియమైన జాన్, మీరంటే నాకు ఎంతో గౌరవం. దయచేసి మీ స్టేట్‌మెంట్స్‌కు నన్ను దూరంగా ఉంచండి. నా ప్రైవసీకి దయ చేసి గౌరవం ఇవ్వండి. ప్రస్తుతం నేను బిడ్డకు జన్మనిచ్చే పనిలో ఉన్నాను. గుడ్ డే సార్' అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. ఇక, ఈ ఏడాది ఏప్రిల్‌లో తాను 20 వారాల గర్భవతినని సెరెనా విలియమ్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
సెరెనా విలియమ్స్ ప్రస్తుతం రెడిట్ కో ఫౌండర్ అలెక్సిస్ ఒహానియన్‌తో సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత డిసెంబర్‌లో వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తర్వాత సెరీనా మళ్లీ టెన్నిస్ టోర్నీలు ఆడలేదు. ఇండియా, మియామీ టోర్నీలకు దూరంగా ఉంది.