
న్యూయార్క్: బ్రిటన్ రాజకుటుంబంలోనూ వర్ణ వివక్ష ఉన్నదంటూ సంచలన ఆరోపణలు చేసిన ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన మార్కెల్‌కు స్టార్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ మద్దతుగా నిలిచారు. తన నిస్వార్థ స్నేహితురాలకి ఈ విషయంలో తాను పూర్తి మద్దతు తెలుపుతున్నానని సెరెనా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో స్పష్టం చేశారు. రాజకుటుంబం నుంచి విడిపోయిన హ్యారీ దంపతులు తొలిసారిగా ఓ టీవీ షోలో మాట్లాడారు. అమెరికాలోని పాపులర్ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రే కార్యక్రమానికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన హ్యారీ, మేఘన .. సంచలన విషయాలు వెల్లడించారు. సుమారు రెండు గంటల ఇంటర్వ్యూలో ప్రపంచం నివ్వెరపోయే కొన్ని విషయాలను మేఘన్ వెల్లడించారు.
తన కెరీర్‌లోనూ ఎన్నోసార్లు వర్ణ వివక్షను ఎదుర్కొన్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. మేఘన మార్కెల్‌కు అండగా నిలబడ్డారు. 'మేఘన మార్కెల్.. నిస్వార్థ స్నేహితురాలు. సానుభూతి, కరుణ ఉన్న ఆమె జీవన విధానం అందరికి ఆదర్శం. 'నిజంగా గొప్పది' అంటే అర్ధం ఏమిటో ప్రతిరోజూ ఆమె నాకు బోధిస్తుంది. మేఘన మాటలు ఆమె అనుభవించిన నొప్పి మరియు క్రూరత్వాన్ని వివరిస్తాయి. లింగ వివక్ష, వర్ణ వివక్ష ఎంత దారుణంగా ఉంటాయో నాకు తెలుసు. శరీర రంగు ఆధారంగా మహిళలను తక్కువ చేసి అణిచేయడానికి చూస్తారు. మన పిల్లలకు మాత్రం ఈ పరిస్థితి ఉండకూడదు' అని సెరెనా పేర్కొన్నారు.
'హ్యారీని పెళ్లి చేసుకోకముందు రాచరికపు జీవితం గురించి నాకు తెలియదు. రాణి ముందు ఎలా ఉండాలనేది కూడా అవగాహన లేదు. హ్యారీతో వివాహం అయిన తొలినాళ్లలో ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ప్యాలెస్‌లోకి వచ్చాక ఎన్నో ఆంక్షలు ఉండేవి. ఒక్కోసారి చాలా ఒంటరిగా అనిపించేది. నెలల తరబడి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో చీకట్లో ఉన్నట్లు అనిపించేది. మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తున్నా.. రాజకుటుంబంలో ఒక్కరు కూడా నాకు సాయం చేయలేదు. పైగా నాపై అసత్య ఆరోపణలు చేశారు. నిందలు వేశారు. వీటన్నింటినీ చూసి ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా' అని మేఘన్ తాజాగా చెప్పారు.
'నేను గర్భవతిగా ఉన్న సమయంలో పుట్టబోయే బిడ్డ రంగు గురించి కుటుంబంలో చర్చ జరిగింది. నేను నల్లగా ఉన్నాను కాబట్టి.. నా బిడ్డ ఆర్చీ కూడా నల్లగానే పుడతాడని వారు ఆందోళన చెందారు. దీని గురించి హ్యారీతో చర్చించారు. అంతేగాక మా బిడ్డకు భద్రత ఉండదని, టైటిల్ కూడా రాదని మాట్లాడుకున్నారు. నా వల్ల తోడికోడలు కేట్ ఏడ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కాదని కుటుంబంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. నిజానికి దీనికి పూర్తి భిన్నంగా జరిగింది' అని మేఘన్ పేర్కొన్నారు.
బ్రిటన్ రాణి ఎలిజబిత్ 2 మనవడు అయిన ప్రిన్స్ హ్యారీ.. 2018, మే 19న బ్రిటన్ విండ్సోర్ క్యాస్టిల్‌లో అధికారికంగా అమెరికా నటి మేఘన్ మర్కెల్‌ను వివాహం చేసుకున్నారు. 2019లో వీరికి కుమారుడు ఆర్చీ పుట్టాడు. అయితే కుటుంబంతో విభేదాల కారణంగా గతేడాది హ్యారీ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. వారు ఆ తర్వాత మేఘన్ స్వస్థలం కాలిఫోర్నియా వెళ్లిపోయారు. ఇక ఈ ఏడాది వేసవిలో మేఘన్ అమ్మాయికి జన్మనివ్వబోతున్నారు.